iDreamPost

పుకార్లకు చెక్ పెట్టేసిన సమంతా

పుకార్లకు చెక్ పెట్టేసిన సమంతా

గత కొంత కాలంగా బయట కనిపించకుండా ఉన్న సమంతా ఎట్టకేలకు అఫీషియల్ క్లారిటీ ఇచ్చేసింది. యశోద ట్రైలర్ కు వచ్చిన స్పందనకు థాంక్స్ చెబుతూనే తన అంతర్థానానికి గల కారణాలు వివరించింది. సామ్ మ్యోసిటిస్ అనే వ్యాధితో బాధ పడుతోంది. అంటే కండరాలకు సంబంధించిన జబ్బు.  కొన్ని నెలల క్రితం ఇది బయట పడింది. ఊహించిన దానికన్నా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలోట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చేస్తున్న పోరాటం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని చెప్పిన సామ్ డాక్టర్లు అతి త్వరలో పూర్తిగా రికవరీ అవుతానని ఇచ్చిన హామీని ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన నోట్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది.

మానసికంగా శారీరకంగా అన్ని బాధలు చవిచూసిన తనకు ఈ పరీక్ష కూడా దాటేస్తాననే నమ్మకం వ్యక్తం చేసింది. సమంతా మాటల్లో కొంత సీరియస్ నెస్ ప్రతిధ్వనిస్తున్నా చివరిలో మాత్రం కోలుకోవడానికి ఇంకో రోజు దగ్గరయ్యాననే సానుకూల దృక్పధం చూపించింది. మొత్తానికి మీడియాలో ప్రచారం జరిగినట్టు ఏవేవో కథనాలు తిరిగినట్టు సామ్ కు వచ్చింది జబ్బే కానీ అది ఫలానా అనే విషయం ఆమె ద్వారానే స్పష్టంగా బయటికి వచ్చింది. హాస్పిటల్ బెడ్ నుంచి వెనుకగా తీసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సెలబ్రిటీలు తనతో నటించిన హీరోలకు సైతం ఇదిప్పుడే తెలిసింది.

చైతుతో విడాకులు తీసుకున్నాక సమంతా కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. యశొద నవంబర్ 11 రిలీజయ్యాక తర్వాతి వరసలో గుణశేఖర్ శాకుంతలం ఉంది. ప్రస్తుతానికి విడుదల వాయిదా వేసి త్రీడి వెర్షన్ ని సిద్ధం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి బాలన్స్ పార్ట్ సమంత తిరిగి రాగానే పూర్తి చేస్తారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సృష్టికర్తలు రాజ్ అండ్ డికెలు తీస్తున్న కొత్త సిరీస్ లోనూ తనే హీరోయిన్. ఇవి కాకుండా మరికొన్ని డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. ఇంత ప్లాన్డ్ గా ఉన్న టైంలో ఇలాంటి కుదుపు రావడం బాధాకరమే కానీ అభిమానులు సంతోషపడేలా త్వరలోనే తిరిగి రానుండటం శుభవార్త.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి