iDreamPost

అరుదైన నేపథ్యంతో సాచి సాహసం

  • Published - 04:00 PM, Tue - 18 October 22
అరుదైన నేపథ్యంతో సాచి సాహసం

మాములుగా సినిమాల్లో హీరో హీరోయిన్ల పాత్రలను ఫలానా వృత్తులకే పరిమితం చేయడం రెగ్యులర్ గా చూస్తుంటాం. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం చిరంజీవి చెప్పులు కుట్టేవాడిగా స్వయంకృషిలో, బెస్తవాడిగా ఆరాధనలో, ఫ్యాక్టరీ లేబర్ గా ఘరానా మొగుడులో కనిపించడం తప్పించి ఈ మధ్య కాలంలో కొత్త జెనరేషన్ స్టార్లు అలాంటి సబ్జెక్టులు చేయలేకపోతున్నారు. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదేమోననే అనుమానమే వాళ్ళను వెనక్కు లాగుతోంది. అయితే అసలు ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకుని ఇలాంటి రిస్కులు చేసేవాళ్ళు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. సాచి అలాంటి విభిన్న ప్రయత్నమేనని చెప్పాలి.

వివేక్ పోతగాని దర్శకత్వంలో ఆయన ఒక నిర్మాణ భాగస్వామిగా ఉపేన్ నడింపల్లితో కలిసి నిర్మించిన రియల్ బయోపిక్ ఈ సాచి. నిజ జీవితంలో బిందు అనే నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కథను తీసుకుని ఈ సాచిని రూపొందించారు. విధి పరిస్థితుల వల్ల తండ్రి వృత్తి చెప్పట్టాల్సి వచ్చిన ఓ యువతీ కథే ఈ సాచి. కుటుంబ భారాన్ని పోషిస్తునే మగాళ్లు చేయాల్సిన పనిని ఎంతో ధైర్యంగా నిర్వహించిన వైనాన్ని ఇందులో చూపించబోతున్నారు. అలా అని దీన్నేమి మెసేజ్ ఓరియెంటెడ్ గా తీయడం లేదు. కమర్షియల్ హంగులను జోడిస్తూనే అమ్మాయిలు ఎందులో అయినా విజయం సాధించగలరనే పాయింట్ ని టచ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇందులో సంజన రెడ్డి, గీతిక రధన్ హీరోయిన్లు కాగా ఇతర పాత్రల్లో స్వప్న, అశోక్ రెడ్డి, మూల విరాట్, టీవీ రామం, ఏవిఎస్ ప్రదీప్ తదితరులు నటించారు. కెవి భరద్వాజ సంగీతం, ప్రసన్న కుమార్ గీత సాహిత్యం సమకూర్చగా దర్శకుడు వివేక్ పోతాగోని మాటలు స్క్రీన్ ప్లే తో పాటు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలే ప్రసాద్ ల్యాబ్ లో వేసిన ప్రీమియర్ కు మంచి ప్రశంసలు దక్కాయి. నాయి బ్రాహ్మణ వర్గం నుంచి వివిధ నాయకులు, ప్రతినిధులు హాజరై సాచిలో నిజాయితీని మెచ్చుకున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సాచికి ప్రేక్షకుల ఆదరణ దక్కితే భవిషత్తులో మరిన్ని ఇలాంటి సినిమాలు వచ్చే అవకాశం ఉంది.