iDreamPost

పుత్రుడు సైలెంట్ గా ఉంటే.. దత్తపుత్రుడు రోడ్డెక్కాడు: అనిల్

పుత్రుడు సైలెంట్ గా ఉంటే.. దత్తపుత్రుడు రోడ్డెక్కాడు: అనిల్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎంతో రాజకీయ అనుభవం కలిగి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అరెస్టు కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సీమెన్స్ స్కాం కేసులో బలమైన ఆధారాలు ఉండటంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు ఉండటంతోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక చంద్రబాబు అరెస్ట్ పై అధికార వైసీపీ తో పాటు వివిధ పార్టీలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ మంత్రులు, ఇతర ముఖ్యనేతలు.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించగా.. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా స్పందించారు.

ఆదివారం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆయన చంద్రబాబు అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాచ్ కూడా లేదని చెప్పుకునే చంద్రబాబుకు గంటకు కోటి రూపాయలు తీసుకునే లాయర్ ఎలా వచ్చాడంటూ ఆయన ప్రశ్నించారు. అలానే మరిదిని కాపాడుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. బంధు ప్రీతి పక్కన పెట్టి.. ఆమె మాట్లాడాలని ఆయన హితవు పలికారు. పక్క సాక్ష్యాలు ఉన్నా కూడా అక్రమ కేసు అని ఎలా చెబుతారంటూ అనిల్ దుయ్యబట్టారు.

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి కూడా అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తన పార్టీ నేతను అరెస్ట్ చేసినట్లు పవన్ కల్యాణ్ ఓవర్ యాక్షన్ చేశారని ఆయన మండిపడ్డారు. సుపుత్రుడే సైలెంట్ గా ఉంటే.. దత్తపుత్రుడు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని అనిల్  దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ కూసాలు కదులుతున్నాయని, ఆయనకు మద్దతుగా జనాలు రోడ్ల మీదకు రావడం లేదని అచ్చెన్నాయుడు మాట్లాడిన ఆడియో లీకైందని అనిల్ తెలిపారు. అవినీతి అనకొండగా ఉన్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ముద్దాయి అయ్యాడని అనిల్ పేర్కొన్నారు.

ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఎం జగన్ నిజాయితీగా వ్యవహరించారని, చట్టం ముందు అందరూ సమానమే అనే మెసేజ్ ను ప్రజలకు పంపామని అనిల్ అన్నారు. మరో ఆరు జన్మలు ఎత్తినా బాబు సీఎం అయ్యే అవకాశం లేదని, ఆయన అరెస్ట్ తో టీడీపీ మూతపడటం ఖాయమని అని పేర్కొన్నారు. మరి.. చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి