iDreamPost

రెండో దఫా వాహన మిత్ర పథకం ప్రారంభం.. ఆటో వాలాలకు సీఎం మరో వరం…

రెండో దఫా వాహన మిత్ర పథకం ప్రారంభం.. ఆటో వాలాలకు సీఎం మరో వరం…

బతికేందుకు కష్టపడుతున్న సమయంలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, ఫెనాల్టీలు అంటూ బతికే పరిస్థితి లేని స్థితిలో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను చూసి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టానని సీఎం జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌ వాహన మిత్ర రెండో దఫా నగదు సహాయం పథకం ప్రారంభించిన తర్వాత సీఎం జగన్‌ మాట్లాడారు. 2018 మేలో ఏలూరు సభలో తాను ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10 వేల కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

గత ఏడాది ఈ పథకం ప్రారంభించగా.. ఈ ఏడాది కరోనా సమయంలో ప్రభుత్వం వీలైనంత సహాయం చేసే ఉద్దేశంతోనే నాలుగు నెలల ముందుగానే ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లతోపాటు వివిధ వర్గాల ప్రజలకు జూన్‌ నెలలో పథకాలు అమలకు సంబంధించి పథకాల క్యాలెండర్‌ను ప్రకటించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. రజకులు, టైలర్లు, క్షరకులు, కాపు మహిళలు ఇలా అనేక వర్గాల వారికి ఈ నెలలో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు జగన్‌ గుర్తు చేశారు.

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధిపొందుతున్న 2,62,495 మందిలో ఎస్సీలు 61,391, ఎస్టీలు 10,049, బీసీలు 1,17,096, మైనారిటీలు 28,118, కాపులు 29,643, మిగిలిన కులాల్లోని పేదలు దాదాపు 16 వేల మంది ఉన్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. వీరందరికీ మంచి చేయాలనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

ఈ రోజు పొరపాటున ఎవరికైనా రాని పరిస్థితి ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం జగన్‌ చెప్పారు. అర్హత ఉన్న వారు ఇంకా ఎవరైనా ఉంటే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలిన చెప్పారు. వారందరికీ వచ్చే నెల 4వ తేదీన 10 వేల రూపాయలు అందిస్తామని సీఎం తెలిపారు. అర్హత ఉండి రాని పరిస్థితి ఉండకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి