iDreamPost

మేనిఫెస్టోలోని మరో హామీ అమలుకు సిద్ధమైన సీఎం జగన్‌

మేనిఫెస్టోలోని మరో హామీ అమలుకు సిద్ధమైన సీఎం జగన్‌

రాష్ట్రంలో మొత్తం సాగు భూమిలో 40 శాతం కన్నా తక్కువ ప్రాంతానికే సాగునీటి సౌకర్యం ఉందనేది సాగునీటి రంగ నిపుణులు చెప్పే మాట. అంటే మిగతా 60 శాతం సాగు భూమికి భూ గర్భ జలాలు, వర్షాధారమే ఆధారం. నేల బావులు, బోరు బావులు ద్వారా భూ గర్భ జలాలను వెలికి తీసేందుకు అన్నదాతలు వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. బోరు వేయడం, మోటారు, పైపుల కోసం అన్నదాత అప్పులు చేయాల్సిన పరిస్థితి దాదాపు 90 శాతం మేర ఉంది.

సన్న, చిన్నకారు రైతులైతే ప్రతి ఒక్కరూ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నమే చేయాలి. ధైర్యం చేసి బోరు వేపిస్తే నీరు పడతాయో లేదో అన్న సందేహం. నీళ్లు పడితే ఫర్వాలేదు. పడకపోతే వచ్చే నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ నాలుగైదేళ్లు రెక్కల కష్టం చేయాలి. అందుకే అధిక శాతం మంది సన్న, చిన్నకారు రైతులు తమ పొలాల్లో బోరు వేపించాలని ఉన్నా.. ఆ సాహసం చేయరు.

ఇలాంటి వారికి కోసమే ఏపీలోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ సరికొత్త పథకం ప్రారంభించబోతోంది. వ్యవసాయాన్ని పండగ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేపించే పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 28వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్‌ జళకళ పేరుతో ప్రారంభించే ఈ పథకం కింద ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పన బోరు రిగ్గులను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. 200 రిగ్గులను ఆయా నియోజకవర్గాల్లో నిత్యం అందుబాటులో ఉంచనున్నారు.

ఈ నెల 28వ తేదీన ఆయా వాహనాలను జెండా ఊపి సీఎం జగన్‌ ప్రారంభించబోతున్నారు. రైతులు బోరు వేపించుకునేందుకు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకునేలా వెబ్‌సైట్‌ను కూడా అదే రోజు సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు.. స్థానిక ఎంపీడీవోల వద్దకు వెళ్లి కూడా దరఖాస్తులు నేరుగా ఇవ్వొచ్చు.

ప్రస్తుతం ప్రైవేటు రిగ్గులు ద్వారా రైతులు అడుగుకు 100 రూపాయలు ఇచ్చి బోర్లు వేపించుకుంటున్నారు. 300 అడుగుల లోతు బోరు వేపిస్తే.. 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. వైసీపీ ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో 1.98 లక్షల బోర్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 200 రిగ్గుల ద్వారా రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో బోర్లు వేయనున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన రిగ్గులను ఇతర ప్రాంతాల అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఉదహారణకు తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట నియోజకవర్గాలైన తుని, ప్రత్తిపాడు, రాజానగరం, పిఠాపురం, రాజమండ్రి రూరల్, ఏజన్పీ ప్రాంతమైన రంపచోడవరం తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్‌ సౌకర్యం తక్కువ. అదే కోనసీమ, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ రూరల్‌ తదితర నియోజకవర్గాల్లో ధవళేశ్వరం బ్యారేజీ తూర్పు, మధ్య కాలువల ద్వారా సాగునీరు రెండు పంటలకు అందుతుంది. ఈ నియోజకవర్గాలకు కేటాయించిన రిగ్గులను మెట్ట, ఏజెన్సీలోని ప్రాంతాల్లో బోర్లు వేసేందుకు ఉపయోగించనున్నారు. ఈ పథకం ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర రైతులకు ఎక్కువగా మేలు జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి