iDreamPost

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష.. వరద బాధితులకు రూ. 10వేల సాయం

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష.. వరద బాధితులకు రూ. 10వేల సాయం

గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. రోజు రోజుకీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో.. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.

ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రమవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న తరుణంలో.. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సీఎం తెలిపారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలన్నారు. అధికారులు మానవీయ కోణంలో సాయం అందించాలన్నారు. డబ్బుల గురించి ఆలోచించకుండా బాధితులకు అండగా ఉండాలన్నారు. అధికారులు తమకు మంచి చేశారు అన్న మాటే తనకు వినిపించాలని సీఎం చెప్పారు.

ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పంపినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అవసరం అనుకుంటే… పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్‌ తెలిపారు. సహాయ శిబిరాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వాలని, వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలన్నారు. కచ్చా ఇళ్లు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా అధికారులు నిలవాలన్నారు. అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్‌, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించిన ధీరజ్‌ సింగ్‌..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి