iDreamPost

కొత్త మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కొత్త మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. తన తండ్రి వైఎస్‌ వివేకా హత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, సిట్‌ దర్యాప్తు ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదనీ, విచారణ త్వరితగతిన పూర్తి చేసేలాగా సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హత్య జరిగిన రోజు పరిణామాలు, పలువురు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వారికి వైఎస్‌ వివేకాతో ఉన్న వైరాన్ని తన పిటిషన్‌లో వివరించారు.

Read Also: వై.యస్ వివేకా హత్య కేసు – పులివెందులకి సిట్ బృందం.

ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 14వ తేదీన పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్‌ వివేకా హత్యకు గురయ్యారు. ఆ సమయంలో టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది. వైఎస్‌ వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అప్పట్లో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ హత్యలో టీడీపీ నేతలపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికల తర్వాత ఏపీలో అధికారం మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ ఎమ్మెల్సీ బి.టెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు.. వివేకా హత్యకేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టును కోరారు.

Read Also: వివేకా హత్య కేసులో టీడీపీ ఉలికిపాటు

కాగా, అంతకు ముందు వైఎస్‌ వివేకా కూడా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టులో పటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా కుమార్తె కూడా సవివరంగా తన అనుమానాలను వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు వైఎస్‌ వివేకా హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించడానికి మీకున్న అభ్యంతరం ఏమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, పిటిషన్లలో ప్రతివాదులుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి