iDreamPost

మెరుగైన సౌకర్యాలతో ఇల్లు – వైఎస్ జగన్

మెరుగైన సౌకర్యాలతో ఇల్లు – వైఎస్ జగన్

రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాల్లో భాగంగా.. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగసభలో ప్రసంగించారు.

‘‘ఇళ్లు అనేది ఒక శాశ్వత చిరునామా. తర్వాతి తరానికి ఇచ్చే ఆస్తి. అలాంటి ఇళ్లను ఇవ్వడం ద్వారా ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది. స్థలం, ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు.. మొత్తం కలిపి అక్షరాల పదిలక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఒక అన్నగా, తమ్ముడిగా అక్కాచెల్లెమ్మల తరపున భరించే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ ఒక్కకాలనీలోనే దాదాపుగా 10,228 ప్లాట్లు ఇళ్ల నిర్మాణం జరగబోతోంది. పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది ’’ అని సీఎం జగన్‌ తెలియజేశారు.

‘‘ఈ మంచి పనికి పదహారునెలల కిందటే అడుగులు వేశాం. కానీ, మన ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారు. మన పాలనకు, నాకు ఎక్కడ మంచిపేరు దక్కుతుందోనేమోనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఇప్పటికి కల సాకారమైంది. కోర్టు వ్యవహారాలు పూర్తికావడానికి సుమారు 489 రోజులు పట్టిందని.. ఈ కార్యక్రమం కోసం ఎప్పటికప్పుడు ఏజీతో చర్చిస్తూ వచ్చామని ఆయన అన్నారు. దేవుడి దయవల్ల సమస్య తీరిపోయి.. లక్షల మందికి మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్‌ అన్నారు.

“పాదయాత్రలో, ఎన్నికల ప్రణాళికలో 25 లక్షలమందికి పైగా ఇళ్లు కటిస్తామని మాటిచ్చాం. కానీ, అదనంగా, మెరుగైన సౌకర్యాలతోనే ఇళ్లులు కట్టిస్తాం. ఇప్పటికే రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చాం. అర్హులైన వాళ్లకు ఇంటిస్థలం ఇప్పించే బాధ్యత నాది. ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో ఇంటి అడ్రస్‌ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదు. రోజుకో అబద్ధప్రచారంలో మునిగిపోతున్న దుష్టచతుష్టయం చేస్తున్న కుయుక్తులను, మంచిని చేస్తుంటే అడ్డుకుంటున్న ప్రయత్నాలను గమనించాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాట తప్పబోము. ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి