iDreamPost

యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్

యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్

ఆన్ లైన్ బెట్టింగులు యువత ప్రాణాలను హరిస్తున్నాయి. ఆన్ లైన్ లో క్రికెట్, కోడిపందేలు బెట్టింగులు కాసి.. అందులో నగదు పోగొట్టుకొని, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు యువకులు. టీ20లీగ్ లో బెట్టింగులు పెట్టి.. తీవ్రంగా నష్టపోయి అప్పులపాలైన యువకుడు మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. తూప్రాన్ శివ్వంపేటకు చెందినన ఆచారి – ముత్యాలు దంపతుల చిన్నకొడుకు కమ్మరి అనిల్ కుమార్ చారి. నగలు తయారు చేసే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనిల్ కుమార్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. కొంతకాలం తాగుడుకి బానిసైన అనిల్.. టీ20 సీజన్ మొదలయ్యాక అందులో బెట్టింగులకు అలవాటుపడ్డాడు.

తల్లి ముత్యాలు బెట్టింగులు మానేయాలని పలుమార్లు చెప్పినా అతనిలో మార్పు రాలేదు. టీ20 లీగ్ ఆఖరి మ్యాచ్ లలో అప్పు చేసి మరీ బెట్టింగులు పెట్టాడు. వాటిని తీర్చలేక.. డబ్బు కావాలని తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో గొడవపడ్డాడు. మే31న అనిల్ కుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతనికోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదు. ఆఖరికి నిన్న తూప్రాన్ పెద్దచెరువులో బతుకమ్మ ఘాట్ వద్ద అనిల్ కుమార్ విగతజీవిగా కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబీకులకు సమాచారమిచ్చారు. మృతుని సోదరుడు అశోక్ చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి