iDreamPost

హింసతో పొత్తు కుదరని సెంటిమెంట్ – Nostalgia

హింసతో పొత్తు కుదరని సెంటిమెంట్ – Nostalgia

ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇంకో చోట అదే స్థాయి ఫలితం అందుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ విషయాన్ని ఎన్నో చిత్రాలు ఋజువు చేస్తూనే వచ్చాయి. దానికి కారణాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. 2005లో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటించిన ‘జోగి’ అక్కడ గొప్ప విజయం అందుకుంది. 61 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడి అప్పటిదాకా ఉన్న పాత రికార్డులు చెరిపేసింది. గురు కిరణ్ అందించిన పాటలు ఊరువాడా మారుమ్రోగిపోయాయి. ఆ టైంలోనే ముప్పై కోట్ల దాకా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ గొప్పగా చెప్పుకునేది. దీన్ని తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో రవీంద్రనాథ్ రెడ్డి హక్కులను కొన్నారు.

2006 సంవత్సరం. రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ దెబ్బకు మాస్ లో అమాంతం ఫాలోయింగ్ పెరిగిపోయిన ప్రభాస్ కు ప్రయోగాత్మక సినిమాలు అచ్చిరావని చక్రం, పౌర్ణమి ఫలితాలు ఋజువు చేశాయి. అందుకే కమర్షియల్ సబ్జెక్టు కోసం ఎదురు చూస్తున్న సమయమది. వరస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న వివి వినాయక్ దర్శకుడిగా జోగి రీమేక్ ప్రతిపాదన డార్లింగ్ కి నచ్చేసింది. వెంటనే ఎస్ చెప్పేశారు. నయనతార హీరోయిన్ గా రమణ గోగుల పాటలు కంపోజ్ చేయగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. కీలకమైన తల్లి పాత్ర చేసేందుకు అప్పటికే చాలా గ్యాప్ తీసుకున్న శారద గారు ఒప్పుకోవడం విశేషం.

అమ్మ ప్రేమలో(శారద)లో గారాబంగా పెరిగిన ఈశ్వర్(ప్రభాస్) జీవనోపాధి కోసం నగరానికి వస్తాడు. అనూహ్యమైన పరిస్థితుల్లో గ్యాంగ్ వార్ లో ఇరుక్కుని తానే ఒక పెద్ద గూండాగా మారి యోగిగా పేరు మార్చుకుంటాడు. కొడుకు కోసం సిటీకి వచ్చి తల్లి అతన్ని చూడకుండానే కన్నుమూసే పరిస్థితులు తలెత్తుతాయి. పాయింట్ మంచిదే అయినప్పటికీ సెంటిమెంట్ లో డ్రామా ఎక్కువ కావడంతో హింస మాస్ కి కనెక్ట్ కాలేకపోయింది. ఒరిజినల్ లో ఏవైతే ప్లస్ అయ్యాయో క్లైమాక్స్ తో సహా అవే ఇక్కడ మైనస్ అయ్యాయి. 2007 సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన యోగి ఆశించిన విజయం దక్కించుకోలేదు. పోటీగా వచ్చిన వాటిలో మణిరత్నం గురు ఫ్లాప్ కాగా ఆ సీజన్ విన్నర్ గా అల్లు అర్జున్ దేశముదురు నిలవడం విశేషం

Also Read : గాడ్ ఫాదర్ కు పాన్ ఇండియా స్కెచ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి