iDreamPost

కొత్తది లేదు.. ఉన్నదానికి ఎసరు..!

కొత్తది లేదు.. ఉన్నదానికి ఎసరు..!

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న సామెత మాదిరిగా ఉంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు పరచకపోగా ఉన్న సంస్థలకు ఎసరుపెడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏపీకి షరాఘాతంలా మారింది. పోరాటాలు, ఆత్మబలిదానాల ద్వారా సాధించుకుని, ఘన చరిత్ర కలిగిన విశాఖ స్టీల్‌ ఇకపై ప్రైవేటు పరం కాబోతోందన్న వార్త ఏపీ ప్రజలకు ఏ మాత్రం రుచించడం లేదు.

విశాఖ కేంద్రం ఏపీలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏడేళ్లుగా ప్రతిపాదనలు దాటలేదు. జోన్‌ను ఏర్పాటుకు నిర్ణీత గడువు ఏమీ లేదని, డీపీఆర్‌ ఇంకా పరిశీలనలో ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరశింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో సమాధానమిచ్చారు. విభజన చట్టంలో ఉన్న హామీల అమలు ఏళ్ల తరబడి ప్రతిపాదనలు దాటకపోగా.. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే ప్రక్రియ మాత్రం ఆగమేఘాలపై సాగుతోంది.

ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే సంస్థ కార్మికులు, ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. వైసీపీ నేత, స్థానిక ఎంపీ సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని స్పష్టం చేస్తున్నారు. లోక్‌సభలోనూ పోరాటం చేస్తామని, స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకుంటామని చెబుతున్నారు. స్థానిక ప్రజల అభిలాషను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని, స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని వైసీపీ ఎంపీ చెబుతుండడం భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఉద్యమం జరగబోతోందనే సంకేతాలను ఇస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి