iDreamPost

బీజేపీ- జ‌గ‌న్ బంధానికి ఏప్రిల్ లో క్లారిటీ

బీజేపీ- జ‌గ‌న్ బంధానికి ఏప్రిల్ లో క్లారిటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విజ‌యం సాధించిన నాటి నుంచి కేంద్రంతో స‌ఖ్య‌తగా ఉండేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న నినాదం ప్ర‌త్యేక హోదా వంటి వాటి విష‌యంలో వెన‌క్కి తగ్గ‌కుండా అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం, ప్ర‌ధానికి లేఖ రాయ‌డం వంటి ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అదేస‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు పార్ల‌మెంట్ లో పూర్తిగా మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. దాదాపు అన్ని కీల‌కాంశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు ఉభ‌య స‌భ‌ల్లోనూ అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ నేప‌థ్యంలో ఇక బీజేపీ, జ‌గ‌న్ బంధం మ‌రింత బ‌ల‌ప‌డి, పరోక్ష స‌హకారం నుంచి ప్ర‌త్య‌క్ష మితృత్వం వైపు మ‌ళ్లుతున్న‌ట్టు అంతా ఊహిస్తున్నారు. ఇటీవ‌లి ప‌రిణామాలు దానికి వంత పాడాయి. వ‌రుస‌గా మోడీ, అమిత్ షాతో జ‌గ‌న్ ప్ర‌త్యేక భేటీలు ఈ ప్ర‌చారానికి దోహ‌దం చేశాయి.

దేశ వ్యాప్తంగా 60కి పైగా రాజ్య‌స‌భ ఎంపీ స్థానాల‌కు ఖాళీలు ఏర్ప‌డుతున్నాయి. ఏప్రిల్ లో వాటిని భ‌ర్తీ చేసేందుకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ ఎలా వ్య‌వ‌హ‌రించ‌బోతుందున్న‌ది కీల‌కంగా మారింది. ఏపీ నుంచి నాలుగు బెర్త్ లు ఖాళీ అవుతున్న త‌రుణంలో వాటిలో ఒక‌టి బీజేపీకి ఆఫ‌ర్ చేశార‌నే ప్ర‌చారం ఉంది. అదే వాస్త‌వం అయితే బీజేపీ తో నేరుగా జ‌గ‌న్ స్నేహం తెర‌మీద‌కు వ‌స్తుంది. గ‌తంలో ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామిగా ఉన్న స‌మ‌యంలో ఏపీ నుంచి సురేష్ ప్ర‌భుకి రాజ్య‌స‌భ అవ‌కాశం దక్కింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు అదే రీతిలో బీజేపీకి మ‌రో ఎంపీ సీటు క‌ట్ట‌బెట్టేందుకు వైఎస్సార్సీపీ స‌న్న‌ద్ధం అయితే ఇక బీజేపీతో పొత్త ఖాయం చేసుకున్న‌ట్టే చెప్ప‌వ‌చ్చు.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం కేంద్ర క్యాబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని బీజేపీ పెద్ద‌లు చెబుతున్నారు. పార్ల‌మెంట్ రెండో ద‌శ బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం దానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండోసారి అధికారం చేప‌ట్టిన మోడీ పాల‌న ఏడాది పూర్త‌వుతున్న నేప‌థ్యంలో మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని స‌మాచారం. దాంతో ఈసారి క్యాబినెట్ లోకి వైఎస్సార్సీపీ చేరే అవ‌కాశాలు బ‌లంగా ఉన్న‌ట్టు వస్తున్న ఊహాగానాలు ఏమేర‌కు నిజం అవుతాయ‌న్న‌ది కూడా తేలిపోతుంది. అవ‌స‌రం అయితే ఎన్డీయేలో చేర‌తామ‌ని మంత్రులు బొత్సా, కొడాలి నాని వంటి వారు కామెంట్ చేసిన నేప‌థ్యంలో అడుగులు క‌మ‌లం గూటి వైపు మ‌ళ్లుతున్నాయా లేదా అన్న‌ది ఏప్రిల్ లో తేలిపోతుంది. ఎన్డీయేలో భాగ‌స్వామ్యం పొందితే మోడీ క్యాబినెట్ లో మ‌రోసారి ఏపీకి రెండు బెర్తులు ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మంత్రివ‌ర్గంలో ఎవ‌రూ లేని విష‌యం తెలిసిందే.

కేంద్రంలో మారుతున్న రాజ‌కీయాల్లో వైఎస్సార్సీపీ, బీజేపీ బంధం ఎటు దారితీస్తుంద‌నేది ఏప్రిల్ నాటికి ఖాయం కాబోతోంది. అదే జ‌రిగితే ఏపీలో కూడా కీల‌క మార్పులు అనివార్యం. విప‌క్షాల్లో ముఖ్యంగా జ‌న‌సేన భ‌విత‌వ్యం గంద‌ర‌గోళంగా మార‌డం, టీడీపీకి మ‌రింత స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి