iDreamPost

తూర్పు రాజకీయం.. కో ఆర్డినేటర్లను మార్చిన వైసీపీ

తూర్పు రాజకీయం.. కో ఆర్డినేటర్లను మార్చిన వైసీపీ

తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీ రెండు నియోజకవర్గాలకు నూతన కో ఆర్డినేటర్లను నియమించింది. తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య నగరమైన రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజవర్గాలకు నూతన కో ఆర్టినేటర్లను నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగుతున్న వేళ వైసీపీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

రాజమహేంద్రవరం సిటీకి ఆకుల..

రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శిఘాకోళ్లపు శివరామసుబ్రమణ్యం స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను వైసీపీ నియమించింది. ఆకుల సత్యనారాయణ 2014లో బీజేపీ తరఫున రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నిలకు ముందు ఆయన జనసేనలో చేరి రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. ఎన్నికల తర్వాత జనసేనను వీడిన ఆయన సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

రూరల్‌కు చందన నాగేశ్వర్‌..

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా చందన నాగేశ్వరరావును వైసీపీ అధిష్టానం నియమించింది. 2009లో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ అయిన చందన బ్రదర్స్‌ యజమాని చందన రమేష్‌ పోటీ చేసి గెలుపొందారు. ఆయన కుమారుడే చందన నాగేశ్వరరావు. ప్రస్తుతం వ్యాపారంలో ఉన్న నాగేశ్వర్‌కు రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతలను వైసీపీ అప్పగించింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు కొనసాగారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున సీనియర్‌ నాయకుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఆకుల వీర్రాజు పోటీ చేశారు.

లక్ష్యం 2024..?

వైసీపీ ఆవిర్భాతం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీని విజయం వరించలేదు. 2014 ఎన్నికల్లో సిటీ నుంచి పోటీ చేసిన ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్‌కుమార్‌.. టీడీపీ–బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో అభ్యర్థిని మార్చినా.. వైసీపీకి అదృష్టం కలసిరాలేదు. ఈ సారి 2004, 2009 లలో కాంగ్రెస్‌ తరఫున సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రౌతు సూర్యప్రకాశరావును బరిలోకి దింపింది. అయినా మునపటి ఫలితమే పునరావృతమైంది.

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి వైసీపీకి ఎదురైంది. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న రూరల్‌ నియోజకవర్గంలో అదే సామాజికవర్గానికి చెందిన కాపు నేత ఆకుల వీర్రాజును 2014 బరిలో నిలిపింది. అయితే బీజేపీ, జనసేన మద్ధతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని విజయం వరించింది. 2019లో త్రిముఖ పోటీ ఆకుల విజయావకాశాలను దెబ్బతీసింది. జనసేన అభ్యర్థికి ఇక్కడ 40 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. ఫలితంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాదాపు పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఈ రెండు నియోజవర్గాల్లో రాబోయే ఎన్నికల్లోనైనా విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే ఎన్నికల తర్వాత పలు మార్పులు చేపడుతోంది. సిటీ నియోజకవర్గంలో ఓటమి తర్వాత రౌతు సూర్యప్రకాశరావు స్థానంలో ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామసుబ్రమణ్యాన్ని నియమించినా.. ఏడాది తిరగకముందే మళ్లీ ఆయన స్థానములో ఆకుల సత్యనారాయణను నియమించడం.. వైసీపీ లక్ష్యాన్ని తెలియజేస్తోంది. రూరల్‌లో బీసీ సామాజికవర్గానికి చెందిన చందన నాగేశ్వర్‌ను నియమించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి