iDreamPost

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. మార్చి15న పోలింగ్

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. మార్చి15న పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో శాసన సభ్యుల కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఆరు స్థానాల్లో ఇద్దరు పాత వారినే ఎంపిక చేయగా మరో నాలుగురు కొత్తవారికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ స్థానం కల్పించారు. ఆరుగురిలో ఒక మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన మహ్మద్‌ ఇక్బాల్, కడప జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా భగీరథరెడ్డి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దువ్వాడ శ్రీనివాస్, చిత్తూరు జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తి, కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కరిమున్నీసాలను తమ పార్టీ అభ్యర్థులుగా సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.

ఇటీవల శాసన మండలిలలో ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇందులో టీడీపీకి చెందిన గుమ్మడి సంధ్యారాణి, గుండుమల తిప్పేస్వామి, వీవీవీ చౌదరిల పదవీ కాలం ముగియగా. వైసీపీకి చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌ పదవీ కాలం కూడా పూర్తయింది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజ్యసభకు ఎన్నిక కావడం, చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉన్న బలం నేపథ్యంలో ఆరు స్థానాలను అధికార పార్టీనే గెలుచుకోనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్చి 4వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. మార్చి 8వ తేదీన సాయంత్రం లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవ్చు. మార్చి 15వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి