iDreamPost

లంచం కావాలా ? అయితే నా గేదెను తీసుకో…

లంచం కావాలా ? అయితే నా గేదెను తీసుకో…

చేతిలో సొమ్ములు పడితేకాని పని జరగని కాలం ఇది. లంచం చేతిలో పెడితేకాని కొందరు ప్రభుత్వ అధికారులు స్పందించని కాలంలో మనం ఉన్నాం. లంచం సొమ్ములు ఇవ్వలేక, తమ పని జరుగక రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు కోకొల్లలుగా ఉంటారు.

శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. లంచం అడిగిన అధికారికి తన దగ్గరున్న వస్తువలను ఖరీదు కడుతూ దుస్తులతో సహా అన్నీ విప్పేసి ఆ అధికారి చేతిలో పెడతాడొక వృద్ధుడు. దాంతో నలుగురిలో నవ్వుల పాలవుతాడా అధికారి. అచ్చం అలాంటి సంఘటనను తలపించే విధంగా నిజంగా ఒక సంఘటన జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి.

వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో నౌథియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ తన పూర్వీకుల ఆస్తిని తన పేరిట బదిలీ చేయించమని తహసీల్దారును విన్నవించుకుంది. కానీ అధికారులు పదివేల రూపాయలు లంచం అడగడంతో ఆమె దగ్గర అంత సొమ్ము లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. కానీ లంచం ఇస్తే తప్ప అధికారులు బదిలీ చేసేలా లేరు. దీంతో విసుగెత్తిపోయిన రాంకలీ పటేల్ అలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయమే ఆమెను ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది.

తనకున్న గేదెను తహసీల్దారు కార్యాలయానికి తీసుకెళ్లి,లంచంగా గేదెను తీసుకుని తన పనిని చేసిపెట్టమని అభ్యర్ధించారు. దీంతో అవాక్కవడం ఆ అధికారి వంతయ్యింది. వెంటనే ప్లేట్ ఫిరాయించిన సదరు అధికారి వివరణ ఇస్తూ ఇదంతా రాంకలీ పటేల్ తమని అల్లరిపాలు చేసేందుకు చేసిన కుట్ర అని కారాలు మిరియాలు నూరి ఆమెపై పోలీస్ పిర్యాదు చేసారు.

ఈ విషయంపై తహసీల్దారు మైఖేల్ టీర్కీ వివరణ ఇస్తూ సదరు మహిళకు నవంబర్ 14 నే రాంకలీ పటేల్ కు పూర్వీకుల ఆస్తిని బదిలీ చేశామని కానీ తమను నవ్వులపాలు చేయడానికి ఆ మహిళ కుట్రపూరితంగా ప్రయత్నించిందని వివరణ ఇచ్చారు.

తెలంగాణాలో తన భూములకు సంబంధించిన పాస్ బుక్కులను ఇవ్వడం లేదన్న కారణంతో సురేష్ అనే వ్యక్తి విజయా రెడ్డి అనే మహిళా తహసీల్దారును సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనాన్ని సృష్టించింది.

కాగా అధికారులు చెబుతున్నట్లు ఆమెకు తహసీల్దారును నవ్వులపాలు చేయాల్సిన అవసరం ఏముందో, అసలు ఆ సంఘటన వెనుక ఉన్న నిజానిజాలు ఏమిటో విచారణలో తెలుస్తుంది. కానీ లంచావతారం ఎత్తిన కొందరు అధికారులకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే తప్ప బుద్ధి వచ్చేలా లేదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి