iDreamPost

తాను చనిపోతూ మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది!

తాను చనిపోతూ మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది!

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రోడ్డు ప్రమాదాలు, గుండెపోటుతో చనిపోవడం చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోవడం ఆస్పత్రికి తరలించే లోపు చనిపోవడం జరుగుతుంది. ఇక రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయినవారు ఉంటారు. అలాంటి వారు అవయవ దానంతో పలువురి జీవితాల్లో వెలుగు నింపుతుంటారు. ఓ వివాహిత తాను చనిపోతూ మరో నలుగురికి పునర్జన్మ ప్రసాదించింది. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా నలుగురి జీవితాల్లో వెలుగు నింపింది. ఏపీలోని సత్యసాయి జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గుండ్ర హరిత (26), యశ్వంత్ ప్రసాద్ రెడ్డి కి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. ఓ ప్రైవేట్ బ్యాంక్ లో అసిస్టెంట్ మెనేజర్ గా పనిచేస్తున్నారు యశ్వంత్. ఈ దంపతులకు పదినెలల చిన్నారి ఉంది. గత నెల 29న ఇంట్లో పనులు చేస్తూనే హరిత హఠాత్తుగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఆమెను సికింద్రాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ కి తరలించారు. ఐసీయూలో ఆమెకు చికిత్స అందించినప్పటిపకీ ఫలితం లేకుండా పోయింది. డాక్టర్లు హరిత కు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు.

ఈ క్రమంలో హరిత కుటుంబ సభ్యులను జీవన్ దాన్ ప్రతినిధులు సంప్రదించారు. అవయవదానం కొంతమంది జీవితాల్లో వెలుగు నింపుతుందని వివరించగా బాధితురాలి భర్త యశ్వంత్, కుటుంబ సభ్యులు ఆమె ఆర్గాన్ డొనేషన్ కి అంగీకారం తెలిపారు. హరిత నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురికి సర్జరీ ద్వారా అమర్చినట్లు జీవన్ దాన్ ఇన్ చార్జి స్వర్ణలత తెలిపారు. అలా చనిపోతూ కూడా హారిక అవయవదానంతో మరో నలుగురి జీవితాల్లో వెలుగు నింపింది. గతంలో చాలా మంది తాము చనిపోతూ.. తమ అవయవదానంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మనిచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి