iDreamPost

కేజ్రీ గెలుపుతో జ‌గ‌న్ క్రేజ్ పెరుగుతుందా..!

కేజ్రీ గెలుపుతో జ‌గ‌న్ క్రేజ్ పెరుగుతుందా..!

రాజ‌కీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండ‌వు. నిత్య ప్ర‌వాహం మాదిరి మార్పులు అనివార్యంగా ఉంటాయి. ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో మార్పులు మొద‌ల‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త ఆరేళ్లుగా తిరుగులేని నేత‌గా క‌నిపించిన న‌రేంద్ర మోడీకి తొలిసారిగా ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా వ‌రుస‌గా ప‌లు రాష్ట్రాల్లో ఎదుర‌వుతున్న ప‌రాభ‌వం క‌మ‌ల‌నాధుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. మోడీ నాయ‌క‌త్వ ప్రాభ‌వానికి కాలం చెల్లుతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. కీల‌క రాష్ట్రాల‌తో పాటుగా గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేసినా ఢిల్లీ ఫ‌లితం కూడా క‌లిసిరాక‌పోవ‌డం దానికి ప్ర‌ధాన కార‌ణం. అదే స‌మ‌యంలో బీజేపీకి ప‌లు మిత్ర‌ప‌క్షాలు దూరం అవుతున్న తీరు మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. న‌మ్మ‌క‌మయిన మిత్రులు శివ‌సేన వంటి వారు కూడా దూర‌మ‌యిన త‌రుణంలో బీజేపీ నేత‌ల‌కు కొత్త బెంగ మొద‌ల‌య్యింది.

గ‌తంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కూడా మోడీ ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. అయినా చాక‌చ‌క్యంగా వాటిని అధిగ‌మించారు. ఇప్పుడు మ‌రోసారి దేశ రాజ‌కీయాల్లో కూడా ప‌ట్టు స‌డ‌ల‌కుండా చూసుకునేందుకు చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్నారు. దానికి అనుగుణంగా పావులు క‌దుపుతున్నారు. ఆ ప‌రిస్థితులే జ‌గ‌న్ కి అనుకూలంగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత తొలిసారిగా ఢిల్లీ వెళ్లి స‌మ‌యంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావ‌డం ప‌ట్ల జ‌గ‌న్ వ్య‌క్తం చేసిన అభిప్రాయం అంద‌రికీ గుర్తు ఉంది. దిగువ స‌భ‌లో సంపూర్ణ మెజార్టీ ఉన్న‌ప్ప‌టికీ ఎగువ స‌భ‌లో ఆధిక్యం కోల్పోతున్న త‌రుణంలో మోడీకి మ‌రింత మంది మిత్రుల స‌హ‌కారం అవ‌స‌రం పెరుగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ కి బీజేపీ పెద్ద‌ల నుంచి సానుకూల సంకేతాలు మొద‌ల‌య్యాయి. వ‌రుస‌గా రెండు రోజుల వ్య‌వ‌ధిలో మోడీ, అమిత్ షా తో ఆయ‌న భేటీ జ‌ర‌గ‌బోతుండ‌డం దానికి ఉదాహ‌ర‌ణ‌. దాంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏపీలో చిక్కులు సృష్టించాల‌ని విప‌క్షాలు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఆటంకం త‌ప్పేలా లేదు. జ‌గ‌న్ తో స్నేహం త‌మ‌కు అవ‌స‌రంగా భావిస్తున్న వేళ మోడీ-షా నుంచి ఏపీలో అధికార ప‌క్షానికి అనుకూలంగా రాజ‌కీయ ప‌రిస్థితులు మారుతున్నాయి. కేజ్రీవాల్ గెలుపుతో జాతీయ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ కి పెర‌గిన క్రేజ్ కార‌ణంగా ఏపీలో ప‌లు ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకునే చాన్స్ ద‌క్కుతోంది. అందులో భాగంగానే మండ‌లి ర‌ద్దు, మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారానికి ముగింపు, సీఆర్డీయే ర‌ద్దు వంటి విష‌యాల్లో జ‌గ‌న్ దూకుడు పెంచేసిన‌ట్టుగా ప‌లువురు భావిస్తున్నారు.

ఇది టీడీపీ నేత‌ల‌కు ఇవి మింగుడుప‌డే అవ‌కాశం లేదు. అందుకు తోడుగా జ‌న‌సేన జీర్ణం చేసుకునే ప‌రిస్థితి కూడా లేదు. దాంతో బీజేపీకి మాజీ మిత్ర‌ప‌క్షం టీడీపీ, తాజాగా తోడ‌యిన జ‌న‌సేన ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి అండ్ అద‌ర్స్ ప‌రిస్థితి కూడా అగ‌మ్య‌గోచ‌రంగానే మారుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. త‌మ‌కు గిట్ట‌ని జ‌గ‌న్ తో మోడీ సన్నిహితంగా వ్య‌వ‌హ‌రించ‌డం మూలంగా త‌మ‌కు గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్ప‌ద‌నే అంచ‌నాకు వారు కూడా వ‌చ్చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇక ఏపీలో త‌మ విధానాల అమ‌లుకి అడ్డంకులు తొల‌గిపోతున్నాయ‌ని భావిస్తున్న జ‌గ‌న్ ఇక జాతీయ స్థాయిలో ఎలాంటి వ్యూహాల‌తో సాగుతార‌న్న‌ది కూడా చ‌ర్చ‌నీయాంశ‌మే. బీజేపీకి బాగా ద‌గ్గ‌ర‌య్యి ఎన్డీయే భాగ‌స్వామిగా మార‌తారా లేక ఏపీ ప్ర‌యోజ‌నాల పేరుతో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న శైలిలో ముందుకు సాగుతారా అన్న‌ది త్వ‌ర‌లో తేల‌బోతోంది. ఏది జ‌రిగినా ఇది ఆస‌క్తిక‌ర‌మే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి