iDreamPost

Sonia Gandhi: లోక్ సభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. నల్లగొండ బరిలో సోనియా..?

  • Published Dec 20, 2023 | 2:01 PMUpdated Dec 20, 2023 | 2:01 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదే జోష్ తో పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా సోనియా గాంధీ నల్లగొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదే జోష్ తో పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా సోనియా గాంధీ నల్లగొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

  • Published Dec 20, 2023 | 2:01 PMUpdated Dec 20, 2023 | 2:01 PM
Sonia Gandhi: లోక్ సభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. నల్లగొండ బరిలో సోనియా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆరు గ్యారెంటీలు అమలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు సాగుతోంది. ఇక రేవంత్ ముందున్న అతి పెద్ద లక్ష్యం రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పార్లమెంట్ సీట్లు గెలవాలి. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీని.. తెలంగాణ నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సోమవారం గాంధీభవన్‌లో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ కాపీని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది. అంతేకాక సోనియా గాంధీ నల్లగొండ నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

నల్లగొండే ఎందుకంటే..

మొదట్లో అనగా.. స్వతంత్రం వచ్చాక.. ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం తగ్గడం.. కాంగ్రెస్ పుంజుకోవడం జరిగింది. ఇక గత కొన్నాళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. బీఆర్ఎస్ జోష్ లో కాంగ్రెస్ హవా కాస్త తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు గాను బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో విజయం సాధించింది.

అయితే ఆ తర్వాత మార్చిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నల్లగొండలో అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరోసారి నల్లగొండ జిల్లాను కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మార్చారు నేతలు.

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహా 11 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ.. భారీ మెజార్టీతో విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో ఉద్ధండులైన నేతలు నల్లగొండ జిల్లా నుంచే ఉన్నారు. ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో పాటు సీనియర్‌ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డికూడా నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలోనే ఉన్నారు.

నల్లగొండ నుంచి పోటీ చేస్తే భారీ విజయం పక్కా..

ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో 11 గెలిచి.. మరోసారి హస్తం పార్టీకి కంచుకోటగా మారింది. ఈ క్రమంలో సోనియాగాంధీ నల్లగొండ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించుకోవచ్చన్న ఆలోచనల్లో జిల్లాలోని సీనియర్‌ నేతలు ఉన్నారు. ఇక తాజా ఎన్నికల్లో.. ఇక్కడ కాంగ్రెస్ నేతలు భారీ విజయంతో గెలిచారు. దాంతో సోనియాగాంధీ నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం పక్కా అంటున్నారు నేతలు. అంతేకాక సోనియా గాంధీ గనక ఇక్కడ నుంచి పోటీ చేస్తే.. నల్లగొండ పేరు మళ్లీ చరిత్రలోకి ఎక్కే అవకాశం ఉంది అంటున్నారు.

అందుకు సోనియాను ఒప్పించడం ద్వారా ఆమె నల్లగొండ నుంచి గెలుపొందడం, అదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా ఊహించని విధంగా అభివృద్ధికి నోచుకుంటుందనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. అంతేకాక ఒకవేళ సోనియా గాంధీ నల్లగొండ నుంచి పోటీ చేస్తే.. అక్కడ టికెట్ ఆశించిన వారికి ఇతర పదవులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి సోనియా అంగీకరిస్తారో లేదో తెలియాలంటే.. వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాలి. మరి నల్లగొండ నుంచి సోనియా పోటీ చేయడం సాధ్యం అవుతుందా కాదా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి