iDreamPost

వాళ్లని ప్రశ్నించలేకపోతున్నారా బాబూ, పవన్..?

వాళ్లని ప్రశ్నించలేకపోతున్నారా బాబూ, పవన్..?

ఏ సమస్య వచ్చినా ఏపీ ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించడం చంద్రబాబుకి అలవాటుగా మారింది. ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్‌ తయారయ్యారు. దాంతో ఈ ఇద్దరు నేతలు జగన్ ప్రభుత్వం మంచి చేసినా చెడుగా చిత్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం ఇప్పటికే స్పష్టమయ్యింది. తాజాగా నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. అన్నదాతల వెన్ను విరిచింది. ప్రకృతి విపత్తుల వేళ ప్రభుత్వం చేయాల్సినంతగా చేసింది. ముఖ్యంగా ప్రాణ నష్టం నివారణలో విజయవంతమయ్యింది. చివరకు వరద జలాల్లో ఇరుక్కున్న వారిని కాపాడడంలో కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చొరవ ఫలితాన్నిచ్చింది. పలువురి ప్రాణాలను కాపాడేందుకు దోహదపడింది.

రైతుల విషయంలో ఇన్సూరెన్స్ అందించేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. డిసెంబర్ 15న పంపిణీ చేయబోతున్నట్టు పది రోజుల క్రితమే సీఎం ప్రకటన చేశారు. అయినప్పటికీ సభలో చంద్రబాబు అండ్ కో నానా హంగామా చేసి చివరకు సస్ఫెన్షన్ చేసే వరకూ చర్చ సాగకుండా అడ్డుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వం చేయనంటే సభను అడ్డుకున్నా అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వం చేస్తానని చెప్పడమే కాదు..దానికి ముహూర్తం కూడా ఖరారు చేసిన తర్వాత సభలో హంగామా చేస్తూ అభాసుపాలయ్యే పరిస్థితిని టీడీపీ కొనితెచ్చుకుంది.

ఇక నివర్ తుఫాన్ నష్టం అంచనాల విషయంలో కూడా డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని, నెలాఖరుకి పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ తుఫాన్ బాధిత రైతాంగాన్ని ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమయ్యిందనే వింత ప్రచారం విపక్షాల నుంచి వినిపించడం విడ్డూరమే. తాజాగా తుఫాన్ వచ్చి వెళ్ళిన వారం రోజులకి ఏపీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం మీద విమర్శలకు పూనుకున్నారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పవన్ గానీ, చంద్రబాబు గానీ రైతుల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. పైగా వారి బాధ్యత కూడా. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ కేంద్రం తీరు పట్ల కనీసం మాట్లాడకపోవడం విస్మయకరం. వాస్తవానికి నివర్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ప్రభావం చూపింది. అంటే జాతీయ విపత్తు తరహాలో దాని తాకిడి ఉంది. దానికి తగ్గట్టుగా కేంద్రం సహాయం అందించాలి. ఇప్పటికే జీఎస్టీ బకాయిలు విడుదల చేయకుండా తాత్సార్యం చేస్తూ రాష్ట్రాల ఖజానా ఎండగట్టింది. ఇప్పుడు కనీసం ప్రకృతి విపత్తుల వేళ కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు పెను భారం అవుతుంది. ఇది బాగా తెలిసిన చంద్రబాబు గానీ, తమ మిత్రపక్ష నేతగా పవన్ గానీ స్పందించకపోవడం విచారకరంగా కనిపిస్తోంది.

విపక్షం అంటే కేవలం ప్రశ్నించడానికి మాత్రమే కాదని, సమస్య పరిష్కారానికి మార్గాలు కూడా చూపాల్సిన అవసరం ఉందని ఈ ఇరువురు నేతలు గ్రహించాలి. లేదంటే విమర్శలకు తప్ప ప్రజలకు ప్రయోజనం కలిగించలేని నేతలుగా మిగిలిపోతారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన నిధులను కూడా విడుదల చేయకుండా, వరద సహాయం లో ఉదారంగా వ్యవహరించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తే నిలదీయలేని పార్టీలుగా ఉండిపోతారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమేరకు తోడ్పడుతుంది, ఎంత నష్ట పరిహారం అందిస్తుందనే విషయంపై ఆయా విపక్ష నేతలు మాట్లాడితే ఏపీ రైతుకి మేలు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి అది తోడయితే ఉపయోగం ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి