iDreamPost

సీఎం చెప్పింది అవాస్తవమని అసెంబ్లీలోనే చెప్పొచ్చుగా అచ్చెన్నా..

సీఎం చెప్పింది అవాస్తవమని అసెంబ్లీలోనే చెప్పొచ్చుగా అచ్చెన్నా..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మద్యం బ్రాండ్లు, అమ్మకాలకు సంబంధించి అసెంబ్లీలో చెప్పిన ప్రతి మాటా అవాస్తమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శ విడ్డూరంగా ఉంది. అసెంబ్లీలో మద్యం పాలసీకి సంబంధించి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా, విస్పష్టంగా ప్రకటన చేస్తే ప్రతిపక్షం అక్కడే ఖండించడం మాని సభ బయట విలేకరుల ఎదుట మాట్లాడడం ఎందుకు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్న మాట్లాడారు. ఐదేళ్లలో మద్యం ఆదాయంతో రూ.10వేల కోట్ల వ్యక్తిగత సంపాదన సీఎం జగన్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకే కొత్త బ్రాండ్లు పాలసీని అమలులోకి తెచ్చారన్నారు. టీడీపీ హయాంలో కొత్త బ్రాండ్లు తెచ్చారని సీఎం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.

వీడియో ఆధారాలతో వివరించిన సీఎం

జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు అంటూ రోజుకో అంకె చెబుతూ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తోంది. అక్కడ సారా తాగి మరణించింది నలుగురే అని సీఎం జగన్‌ సభలో ఇప్పటికే ప్రకటించారు. అయినా రోజుకో తరహాలో నిరసన వ్యక్తం చేస్తోంది. సభలో కావాలనే అల్లరి చేస్తూ టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అవుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నిన్న సభలో ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీకి, బేవరేజ్ కి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ప్రస్తుతం వింత వింత పేర్లతో అమలులో ఉన్న బ్రాండ్‌లు అన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో అనుమతించినవే అని ఉదాహరణలతో,  తేదీలతో, వీడియో ప్రదర్శనలతో సభలో సవివరంగా స్పష్టం చేశారు.

టీడీపీకి విశ్వసనీయత ఉంటుందా?

ముఖ్యమంత్రి సభలో చెప్పిన ప్రతిమాటా అవాస్తవం అంటున్న అచ్చెన్న దాన్ని అసెంబ్లీలోనే ఎందుకు ఖండించలేదు? ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాధినేత అవాస్తవాలు చెబుతున్నారని నిరూపించవచ్చు కదా. సభలోనే సీఎం వాదనను తమ వద్ద ఉన్న ఆధారాలతో ఎండగట్టాలి. ముఖ్యమంత్రి సభను పక్కదోవ పట్టించారని నిరూపించాలి. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇవ్వవచ్చు. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు. ప్రాక్టీసులో ఉన్న పార్లమెంటరీ పద్ధతులు. ఇంత చక్కటి రాజమార్గాన్ని వదిలేసి ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను విలేకరుల ఎదుట ఖండిస్తే ఎవరు నమ్ముతారు. అసెంబ్లీ నుంచి పథకం ప్రకారం సస్పెండ్‌ అయి బయటకు వచ్చి రాజకీయ, అవినీతి ఆరోపణలు చేస్తే టీడీపీకి విశ్వసనీయత ఉంటుందా? సభలో ముఖ్యమంత్రి చెప్పిందంతా వాస్తవం కనుకనే అక్కడ ఎలా స్పందించాలో తెలియక బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారని జనం అనుకోరా?

తమ గొంతు నొక్కడానికి ప్రభుత్వం టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసి సభను ఇష్టానుసారం నడుపుకుంటోందని అరిగిపోయిన రికార్డును వినిపిస్తే ఎవరైనా నమ్ముతారా? టీవీలు, సోషల్‌ మీడియా సాక్షిగా టీడీపీ.. అసెంబ్లీలో, మండలిలో రోజూ చేస్తున్న విడ్డూరమైన నిరసన ప్రదర్శనలను జనం గమనిస్తున్నారు. అసెంబ్లీలో చర్చ కన్నా రచ్చకే టీడీపీ ప్రయత్నిస్తోందని అర్థం చేసుకుంటున్నారు. అయినా తమ మీడియా ప్రచారం ద్వారా జనాన్ని పక్కదోవ పట్టించవచ్చని టీడీపీ నమ్ముతుండడమే వింతగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి