iDreamPost

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఐదు పేర్లు.. వారిలో ఎవరు..?

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఐదు పేర్లు.. వారిలో ఎవరు..?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పదవి ఎవరికి అనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. టీపీసీసీ చీఫ్‌ ఎంపిక కోసం సుమారు 162 మంది వివిధ స్థాయి నాయకుల వద్ద పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ సేకరించిన అభిప్రాయాలు, ఇతర మార్గాల ద్వారా ఏఐసీసీ సేకరించిన సమాచారం ఆధారంగా అధిష్ఠానం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కులాలు, వర్గాల వారీగా సమీక్షించిన ఏఐసీసీ.. ఐదుగురి పేర్లతో జాబితా రూపొందించినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బ్రాహ్మణ వర్గం నుంచి శ్రీధర్‌బాబు, ఎస్సీల నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, బీసీల నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ల పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సహజంగా కేటగిరీల వారీగా పేర్లు ఇవ్వాల్సి ఉంటుందని, అందులో భాగంగానే ఆ జాబితాను పార్టీ అధినేత్రి సోనియాకు సమర్పించినట్లు సమాచారం.

పది రోజులు పట్టే చాన్స్‌

అన్ని అంశాలను బేరీజు వేసుకుని సోనియా, రాహుల్‌లు టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన పోటీదారుల్లో ఆ పదవి దక్కనివారిని పిలిపించి ప్రత్యామ్నాయంగా మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే టీపీసీసీ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే ప్రధానంగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబుల పేర్లే పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరో వారం 10 రోజుల్లోపే అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సోనియాకు ఐదు పేర్లతో జాబితా పంపినా.. ప్యానల్‌లో మాత్రం వివిధ వర్గాల ప్రతిపాదనల మేరకు చాలా పేర్లపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి పేర్లు, బీసీల నుంచి మాజీ ఎంపీలు వి. హన్మంతరావు, మధుయాష్కీగౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, ఎస్సీ వర్గం నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పేర్లు ఉన్నట్లు తెలిసింది. అన్ని అంశాలను చర్చించి ఐదుగురి పేర్లను తుది చర్చ కోసం సోనియాకు పంపినట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి