iDreamPost

“పుష్ప‌”లో అల్లు అర్జున్ ఎవ‌రు?

“పుష్ప‌”లో అల్లు అర్జున్ ఎవ‌రు?

“పుష్ప‌” పోస్ట‌ర్‌లో అల్లు అర్జున్ వెరైటీగా ఉన్నాడు. చిత్తూరు జిల్లాలోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంతో సినిమా కాబ‌ట్టి అర్జున్ పాత్ర ఏంటి? అనే క్యూరియాసిటీ అంద‌రిలో క‌నిపిస్తోంది.

అర్జున్ స్మ‌గ్ల‌రా? లేదా కూలీనా, అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న బాధితుడా? ఎర్ర‌చంద‌నం ప్ర‌త్యేక‌త ఏమంటే అది తిరుప‌తి స‌మీపంలోని శేషాచ‌లం అడ‌వుల్లోనే ఎక్కువ దొరుకుతుంది. 40 ఏళ్ల క్రితం దాని విలువ ఎవ‌రికీ తెలియ‌దు. చుట్టుప‌క్క‌ల గ్రామాల వాళ్లు కొయ్య ప‌నుల‌కి, బొమ్మ‌లు చేయ‌డానికి వాడేవాళ్లు. ఫారెస్ట్ వాళ్లు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకునేవాళ్లు కాదు.

దానికి చైనా మార్కెట్‌లో డిమాండ్ ఏర్ప‌డింది. ఇప్ప‌టికీ ఎర్ర‌చంద‌నాన్ని చైనా వాళ్లు ఎందుకు వాడుతారో ఎవ‌రికీ తెలియ‌దు. సంగీత ప‌రిక‌రాలు, ఔష‌ధాల్లో వాడుతార‌ని అంటారు కానీ, వాస్త‌వం తెలియ‌దు. మ‌ద్రాస్ పోర్టు నుంచి ఎర్ర‌చంద‌నం ర‌హ‌స్యంగా త‌ర‌లివెళుతుంది.

ఇది క‌నిపెట్టిన చిత్తూరు జిల్లా స్మ‌గ్ల‌ర్లు రంగంలోకి దిగారు. 1985 నుంచి స్మ‌గ్లింగ్ మొద‌లైంది. ఒక‌ప్పుడు స్థానికులకే కూలీ ఇచ్చి చెట్లు కొట్టించి , అధికారుల‌కి లంచాలు ఇచ్చి లారీల్లో త‌ర‌లించేవాళ్లు. అయితే రానురాను అధికారుల త‌నిఖీలు ఎక్కువ‌య్యాయి. స్థానికులైతే లీక్ చేస్తార‌నే భ‌యంతో త‌మిళ‌నాడు నుంచి కూలీల‌ను ర‌ప్పించి , స్లీప‌ర్ సెల్స్‌గా విభ‌జించారు. అంటే ఒక బ్యాచ్‌కి ఒక ప‌ని అప్ప‌చెబితే ఆ ప‌ని మాత్ర‌మే చేస్తుంది. త‌ర్వాత జ‌రిగేది వాళ్ల‌కి తెలియ‌దు.

అడ‌విలో చెట్టుని మార్క్ చేసే ప‌ని ఒక బృందం చేస్తుంది. దాన్ని న‌రికే ప‌ని ఇంకొక‌రిది, ముక్క‌లు చేసే ప‌ని ఇంకొక‌రిది. ఆ దుంగ‌ల్ని డంప్ చేసేవాళ్లు వేరే. డంప్ నుంచి పాలు, కూర‌గాయ‌లు చాటున త‌మిళ‌నాడు చెక్‌పోస్టు వ‌రకూ తీసుకెళ్లే వ్యాన్లు, లారీలు స‌ప‌రేట్‌. త‌మిళ‌నాడు నుంచి మ‌ద్రాస్ పోర్టు వ‌ర‌కు చేర్చే బాధ్య‌త ఇంకొక‌రిది. ఇదంతా కోఆర్డినేట్ చేసేవాడు కీల‌కం.

ఈ స్మ‌గ్గ‌ర్లు కోట్లు సంపాదిస్తే , జీవితాల్ని బ‌లి పెట్టుకుని జైళ్ల‌కు వెళ్లిన వాళ్లు ఎంద‌రో. కొన్నేళ్ల క్రితం పోలీస్ కాల్పుల్లో చాలా మంది త‌మిళ కూలీలు చనిపోయారు. ఏదో ఒక రాజ‌కీయ పార్టీ అండ‌తో ఈ స్మ‌గ్ల‌ర్లు ఉంటారు. ఆపోజిట్ పార్టీ అధికారంలోకి వ‌స్తే వీళ్ల మీద కేసులు పెడ‌తారు.

స్మ‌గ్గ‌ర్ల వ‌ల్ల బాధ‌లు ప‌డి , ప‌గ తీర్చుకునే క్యారెక్ట‌ర్‌గా బ‌న్నీ క‌నిపిస్తాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. పుష్ప‌రాజ్‌గా చాలా ర‌ఫ్‌గా క‌నిపించే అల్లు అర్జున్‌లో ఇంకో కోణం క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి