iDreamPost

తెల్లకార్డుదారులు ఎకరం మూడు కోట్లు పెట్టి కొన్నారట..!

తెల్లకార్డుదారులు ఎకరం మూడు కోట్లు పెట్టి కొన్నారట..!

అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేండింగ్‌పై రోజులు గడిచేకొద్దీ ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారంలో దృష్టి పెట్టిన సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే దాని చుట్టు పక్కల గ్రామాల్లో 4,070 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేశారంటూ.. మంత్రి వర్గ ఉప సంఘం నిర్వహించిన ప్రాథమిక విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బినామీల ద్వారా నడిపించినట్లు వెల్లడైంది. 797 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు అమరావతిలో కోట్ల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేయడం సంచలనం రేకెత్తించింది.

తీగ లాగితే డొంక కదిలినట్లు వెంకటపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ పిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ ఒక్కొ విషయాన్ని కూపీ లాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ముఖ్యంగా తెల్లరేషన్‌ కార్డుదారులు కొన్న భూముల వివరాలపై ఆరా తీస్తోంది. తద్వారా వారి వెనుక ఉన్న బడాబాబుల గుట్టు సులువుగా రట్టు చేయొచ్చన్న లక్ష్యంతో పని చేస్తోంది. బుధవారం సీఐడీ అధికారులు మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ మధ్య జరిగిన లావాదేవీలు, అందులో భారీ మొత్తంలో కొనుగోళ్లు, వాటిలో తెల్లరేషన్‌కార్డుదారుల వివరాలను సేకరించింది.

రికార్డులు పరిశీలించిన అధికారులు… భూములు కొనుగోలు చేసిన వారిలో భారీ సంఖ్యలో తెల్లరేషన్‌కార్డుదారులు ఉన్నారని గుర్తించారు. ఎకరం మూడు కోట్ల రూపాయలు వెచ్చించి వారు భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ.. ఈడీ, ఆదాయపన్ను శాఖలకు లేఖలు రాసి దర్యాప్తు చేయాలని కోరింది. మంగళగిరిలో 148 మంది, తాడేపల్లిలో 49 మంది, తుళ్లూరులో 238 మంది, తాడికొండ మండలంలో 188 మంది తెల్లరేషన్‌కార్డుదారులు వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ లెక్క తేల్చింది. ఎకరం భూమి మూడు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారంటే.. వారు తప్పకుండా బినామీలై ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సీఐడీ దూకుడుతో టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి