iDreamPost

పార్టీ కోటాలో బీసీలకు ఇచ్చే ఆ జడ్పీ పీఠం ఏది..?

పార్టీ కోటాలో బీసీలకు ఇచ్చే ఆ జడ్పీ పీఠం ఏది..?

కోర్టు ఆదేశాలతో బీసీలకు స్థానిక సంస్థల్లో తగ్గిన 10 శాతం రిజర్వేషన్లను పార్టీ కోటాలో భర్తీ చేస్తామని అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ అధినేతలు పోటా పోటీగా చేసిన ప్రకటనలు ఆ పార్టీల్లో జడ్పీ చైర్మన్‌ పీఠాలపై ఆశలు పెట్టుకున్న వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు తమ ఆశలు ఎక్కడ అడియాశలవుతాయోనన్న ఆందోళన మొదలైంది. జగన్‌ మాట ఇచ్చాడంటే.. తప్పడు.. అనే పేరు ఉండడంతో.. ఆశానువాహుల ఆశలు గల్లంతుకావడం తథ్యమనే భావన నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే అస్త్ర సన్యాసం చేసింది. ఫలితంగా 13 జిల్లా పరిషత్‌లు అధికార పార్టీ గెలుచుకునే అవకాశం పుష్కలంగా ఉంది. 13 జిల్లాల్లో 6 జడ్పీ పీఠాలు రిజర్వ్‌ చేశారు. విశాఖ ఎస్టీ మహిళ, తూర్పుగోదావరి ఎస్సీ, గుంటూరు ఎస్సీ మహిళ, శ్రీకాకుళం బీసీ మహిళ, అనంతపురం బీసీ మహిళ, పశ్చిమగోదావరి బీసీలకు కేటాయించారు. మిగిలిన ఏడు స్థానాలు జనరల్‌లో ఉంచారు. ఈ ఏడు స్థానాల్లో మూడు ( కృష్ణ, ప్రకాశం, నెల్లూరు) జనరల్‌ మహిళలకు కేటాయించగా.. మిగిలిన విజయనగరం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు జనరల్‌లో ఉంచారు.

బీసీలకు పార్టీ పరంగా 34 శాతం సీట్లు ఇస్తామని చేసిన ప్రకటనతో.. విజయనగరం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒకదానికి బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ జిల్లాలో ఏ పార్టీ జడ్పీ పీఠం గెలిచినా.. ఆ స్థానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు జిల్లాల్లో జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతలు ఎక్కడ తమ ఆశలు ఆడియాశలవుతాయోన్న ఆందోళనలో ఉన్నారు.

జనవరి 3వ తేదీన ఖరారు చేసిన రిజర్వేషన్లలో విజయనగరం జడ్పీ పీఠం ఎస్సీలకు రిజర్వ్‌ చేయగా.. మరో ఐదు రోజులకు దాన్ని తిరిగి జనరల్‌కు మార్చారు. తాజాగా 50 శాతం కోటాతో ఖరారు చేసిన రిజర్వేషన్లలోనూ విజయనగరం జనరల్‌లోనే ఉంది. కాబట్టి ఈ స్థానం బీసీలకు ఇచ్చే అవకాశం లేదని చెప్పాలి. ఇది గాక.. మిగిలిన మూడు జిల్లాలు రాయలసీమలోనివి. సీఎం సొంత జిల్లా కడప, కర్నూలులో గత ఎన్నికల్లో పార్టీ కోసం అసెంబ్లీ సీటు వదులుకున్న నేతలు, పార్టీ కోసం పని చేసిన జనరల్‌ నేతలున్నారు. ఇక మిగిలింది చిత్తూరు మాత్రమే. 59.85 శాతంతో రిజర్వేషన్లు ఖరారు చేసిన సమయంలో చిత్తూరు బీసీలకు దక్కింది. ఇప్పుడు జనరల్‌లో ఉంది. రాజకీయ సమీకరణాలన్నీ బేరీజు వేసుకున్న తర్వాత చిత్తూరు జిల్లా పీఠాన్నే అధికార పార్టీ బీసీలకు కేటాయించొచ్చన్న అంచనాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి