iDreamPost

మహానాడులో క్యాడర్ వాయిస్ కు చోటేది ? .. చంద్రబాబు భజనకే ప్రాధాన్యం

మహానాడులో క్యాడర్ వాయిస్ కు చోటేది ? .. చంద్రబాబు భజనకే ప్రాధాన్యం

’పార్టీ నుండి నేతలు ఎంతమంది వెళ్ళిపోయిన బాధ లేదు. ఎందుకంటే పార్టీకి పటిష్టమన క్యాడర్ ఉంది’ అని చంద్రబాబునాయుడు కొన్ని లక్షల సార్లు చెప్పుంటాడు. అసలు క్యాడర్ లేనిదే పార్టీ లేదని కూడా చెప్పిన విషయం అందరూ చూసిందే. మరలాంటి క్యాడర్ కు మహానాడులో మాట్లాడే అవకాశమే ఎందుకు ఇవ్వలేదు ? చంద్రబాబు, నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు ఎప్పుడూ ఉండేవే కదా. సందర్భం ఏదైనా చంద్రబాబు, నేతలు మాట్లాడేది ఒకటేగా ఉంటుంది. తనను తాను పొగుడుకోవటం, జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే చంద్రబాబు చేస్తున్నది. నేతలు కూడా అదే దారిలో వెళుతున్నారు. మరి క్షేత్రస్ధాయిలో పార్టీ వాస్తవ పరిస్ధితి చంద్రబాబుకు, నేతలకు ఎప్పటికి తెలుస్తుంది ?

రెండు రోజుల మహానాడులో మొదటి రోజు సీనియర్ నేతల ఊకదంపుడు ప్రసంగాలతోనే సరిపోయింది. ఎవరు మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా చంద్రబాబునాయుడు బ్రహ్మాండం, జగన్మోహన్ రెడ్డి పాలన అరాచకం, అవినీతిమయం. మొదటిరోజైన బుధవారం నాడు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ఎంఎల్ఏలు, ఎంపిలు అనేక అంశాలపై మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళంతా సీనియర్లే కావటంతో మొత్తం చంద్రబాబు భజనకే సరిపోయింది. మరి సంవత్సరాల తరబడి పార్టీ బ్యానర్లు మోసి జెండాలు కట్టిన వారికి, క్షేత్రస్ధాయిలో జనాల్లోనే తిరుగుతున్న కార్యకర్తలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. క్యాడర్ కు మాట్లాడే అవకాశం ఇస్తేనే పార్టీలోని లోపాలేంటి ? ఎలా సరిదిద్దుకోవాలనే విషయం తెలుస్తుంది.

మామూలుగా ఎప్పుడు మహానాడు జరిగినా అట్టడుగునుండే కార్యకర్తలకు వేదిక నుండి ప్రసంగించే అవకాశాలు చాలా తక్కువగానే వస్తుంది. అయితే ఎప్పుడైనా ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కొందరు కార్యకర్తలకు కూడా అవకాశాలు ఇస్తారు. అప్పుడు మాత్రమే పార్టీలో జరగాల్సిన మార్పులు, పార్టీ నాయకత్వం గురించి జనాలు ఏమనుకుంటున్నారనే విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళకు పార్టీలో పదవులు రావు, ప్రభుత్వంలో కూడా పదవులు వచ్చే అవకాశాలు దాదాపు ఉండవనే అనుకోవాలి. గతంలో కూడా కొందరికి మాట్లాడే అవకాశం ఇచ్చినపుడు నేతలు చేసిన తప్పుల గురించి క్యాడర్ నిర్భయంగా చెప్పిన సందర్భాలున్నాయి.

గతంలో మహానాడు సందర్భంగా మాట్లాడిన క్యాడర్ చంద్రబాబునాయుడు మారాల్సిన అవసరం ఉందని, మంత్రులుగా పనిచేసిన వారు లేకపోతే మాజీ మంత్రుల్లో లోపాలు ఎక్కడున్నాయో వివరించారు. ఎంఎల్ఏల పనితీరు వల్ల జనాలు పార్టీకి ఏ విధంగా వ్యతిరేకమవుతున్నారనే విషయాన్ని మైకులో అందరి ముందు స్పష్టంగా చెప్పిన ఘటనలున్నాయి. గతంలో ఇటువంటివి జరిగినపుడు పార్టీ నాయకత్వం చాలా సార్లు ఇబ్బందులు పడిన ఘటనలున్నాయి. అందుకనే సాధ్యమైనంత వరకూ క్రిందిస్ధాయి కార్యక్తలకు మాట్లాడే అవకాశాలు రావటం తక్కువైపోయింది.

ఇపుడు జరుగుతున్నది జూమ్ వెబినార్ మహానాడు కాబట్టి ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలతో మాట్లాడించేంది అనుమానమే అంటున్నారు పార్టీ నేతలు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఘోరంగా ఓడిపోయిందో చంద్రబాబతో సహా ప్రతి ఒక్క సీనియర్ నేతకు బాగా తెలుసు. అయినా తమలోని తప్పులను అంగీకరించే ధైర్యం ఎవరిలోను లేదు కాబట్టే ఎంతసేపు వైసిపికి ఓట్లేసిన జనాలనే తప్పు పడుతున్నారు. గడచిన ఏడాది కాలంలో చంద్రబాబు, సీనియర్ నేతలు ఎప్పుడు మాట్లాడినా జనాలను ఎన్నిసార్లు తప్పు పట్టారో అందరూ చూసిందే.

పార్టీలోని నేతలంతా ఇంకా అదే భ్రమల్లో ఉన్నారు కాబట్టి ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను మాట్లాడించే సాహసం చేయకపోవచ్చని సమాచారం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినపుడు నిజాలు చెప్పేస్తే అందరూ ఇబ్బందులు పడాల్సుంటుంది. పైగా ఈ సారి వాళ్ళతో మాట్లాడించటానికి టెక్నాలజీ పరిమితులని మొదటి నుండి చంద్రబాబు ఓ సాకును రెడీ చేసి పెట్టుకున్నాడు. పార్టీ వైఫల్యాలపై చర్చలు జరగాలని ఓడిపోయిన దగ్గర నుండి డిమాండ్ వినిపిస్తోంది.

జిల్లాల వారీగా చేసిన సమీక్షల్లో చంద్రబాబుకు క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను కార్యకర్తలు వినిపించారు. అక్కడక్కడ మాట్లాడటం వేరు మహానాడు వేదిక నుండి మాట్లాడటం వేరు కదా ? ఇప్పుడు మాట్లాడితే ఒకేసారి వేలాది మంది నేతలు కూడా వింటారని కార్యకర్తలు భావిస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ మీద కార్యకర్తల ఆలోచనలకు విరుద్ధంగా చంద్రబాబు ఆలోచనలున్నాయి. అందుకనే ఈ మహానాడులో పార్టీ వాయిస్ వినిపించే అవకాశం తక్కువనే అనుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి