iDreamPost

గంటా.. అధికారిక ప్రకటనే తరువాయా..?

గంటా.. అధికారిక ప్రకటనే తరువాయా..?

విశాఖ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం వరకూ హైడ్రామా చోటుచేసుకుంది. విశాఖ పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు చంద్రబాబు మద్ధతు ప్రకటించాలంటూ డిమాండ్‌ చేస్తూ వారు నిరసనకు దిగారు. చంద్రబాబు కాన్వాయ్‌ను ముందుకు కదలనీయకుండా అడ్డగించారు.

చంద్రబాబుకు మద్ధతుగా ఆ పార్టీ మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్పు. కింజారపు అచ్చెన్నాయుడులు ఆది నుంచీ ఆయనతోనే ఉన్నారు. కానీ విశాఖ జిల్లా నేత, మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు మాత్రం అక్కడ కనిపించలేదు. దీంతో గంటా టీడీపీ వీడారని అధికారిక ప్రకటన విడుదలవడమే తరువాయని టీడీపీ శ్రేణులు అంచనాకొచ్చాయి.

2009లో ప్రజా రాజ్యం పార్టీ తరఫున గెలిచిన గంటా శ్రీనివాసరావు.. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి మళ్లీ మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఇక అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడంలేదు. ఈ నేపథ్యంలో గంటా పార్టీ మారుతారని ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే గంటా వ్యవహార శైలి ఉంది. కానీ అధికారికంగా ఆయన ప్రకటన చేయలేదు.

వైఎస్సార్‌సీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు త్రీవ ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే వైఎస్సార్‌సీపీ డోర్‌ ఎంత కొట్టినా తీయకపోవడంతో గంటా రూట్‌ మార్చారు. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయంలో చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యహారంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీని వీడేది ఖాయమనే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అధికారిక ప్రకటనే మిగిలిందని విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖ భూ కుంభకోణంలో గంటా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి