iDreamPost

అక్కినేని బ్రహ్మచారి జాడ ఎక్కుడ

అక్కినేని బ్రహ్మచారి జాడ ఎక్కుడ

ఏ ముహూర్తమో ఏమో కానీ అసలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మొదలుపెట్టిన టైం బాగా లేనట్టుంది. ఏకంగా బాహుబలి రేంజ్ లో జరుగుతున్న ఆలస్యం చూస్తూ చూస్తూ అభిమానులు ఇప్పటికే దీని మీద ఆసక్తిని తగ్గించుకుని ఏజెంట్ మీద దృష్టి పెట్టారు. ఇక సాధారణ ప్రేక్షకుల గురించి చెప్పేదేముంది. ఏకంగా మర్చిపోయారు కూడా. లాక్ డౌన్ ఎత్తేశాక థియేటర్లు తెరుచుకున్నాక కూడా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. గీతా ఆర్ట్స్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంత నెమ్మదిగా నిర్మాణం సాగిన సినిమా ఇదే మొదటిది కావొచ్చు. మొన్నెప్పుడో గుమ్మడికాయ కొట్టేశాం అన్నారు కానీ లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

హీరో ఎవరైనా సరే జనంలో ఒక సినిమాకు పబ్లిసిటీ పరంగా ఒక టెంపో మైంటైన్ చేయడం చాలా అవసరం. లేదంటే మనమే దాన్ని చేతులారా చంపేసినట్టు ఉంటుంది. ఫలితం ఏమవుతుందో తర్వాత సంగతి. ముందు మార్కెటింగ్ చేయాలి. మన సినిమా ఉందన్న సంగతి అందరూ గుర్తించాలి. అంతే కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఏదీ పట్టనట్టు ఉంటే రేపు రిలీజయ్యాక ఓపెనింగ్స్ చూసి భోరుమనాల్సి ఉంటుంది. అసలు ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఎస్ఆర్ కల్యాణమండపం లాంటి సినిమాలే అంతో ఇంతో బజ్ తెచ్చుకోగా లేనిది ఇంత సెటప్ ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ ఇలా మౌనంగా ఉండటం విచిత్రం.

అప్పుడెప్పుడో జనవరి అన్నారు. సాధ్యపడలేదు. కట్ చేస్తే ఆ ప్రకటన వచ్చి ఎనిమిది నెలలు దాటేసింది. హీరోయిన్ పూజా హెగ్డే, గోపి సుందర్ సంగీతం, గీతా లాంటి ఖర్చు పెట్టె సంస్థ ఇన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని సామెత చెప్పినట్టు ఉంది ఈ సినిమా పరిస్థితి. పోనీ ఓటిటిలో వదిలేస్తే ఓ పనైపోతుంది కానీ ఆ దిశగా అయినా ఆలోచిస్తున్నారో లేదో. అసలే ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు లేక ఆగస్ట్ చాలా డల్ గా కనిపిస్తుంటే కనీసం అఖిల్ లాంటి వాళ్ళు వచ్చినా అంతో ఇంతో సందడి కనిపించేది. కానీ ఆ అవకాశాన్ని చేజేతులా వదిలేసుకున్నారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సైతం బయట ఎక్కడైనా కనిపిస్తే ఒట్టు

Also Read :మూడు భాషల్లో మహా బిజీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి