iDreamPost

కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ తొలిసారి ఎప్పుడు ప్రకటన చేశారో తెలుసా?

కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ తొలిసారి ఎప్పుడు ప్రకటన చేశారో తెలుసా?

2017 లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి చంద్రబాబు పన్నిన ప్రలోభాల కారణంగా టీడీపీ గూటికి చేరారు. ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే గుండెపోటు కారణంగా భూమా నాగిరెడ్డి మరణించడంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయడానికి ఉప ఎన్నిక జరిగింది. కాగా నాడు నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేయడమే కాకుండా అప్పటికప్పుడు నంద్యాల ఇరుకు రోడ్లను వెడల్పు చేయడం ప్రారంభించాడు.. విశాలమైన రహదారులు భూమా నాగిరెడ్డి కల అంటూ ప్రచారం ఊదరగొట్టాడు. సినీ నటులను కూడా తీసుకొచ్చి టీడీపీ తరపున ప్రచారం చేయించాడు. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికను ఎలాగైనా గెలవాలని చంద్రబాబు హుకుం జారీ చేయడంతో మొత్తం టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేసి ప్రచారం చేశారు.

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సానుభూతి సినీనటుల ప్రచారంతో నంద్యాల హోరెత్తిపోయింది. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇదంతా చేసింది కేవలం కొత్తగా పార్టీ పెట్టి చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తూ రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదుగుతున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనే యువ నాయకుడిని ఎదుర్కోలేకనే అన్నది జగమెరిగిన సత్యం. నాడు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైయస్ జగన్ ఒక్కడే తన పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తే చంద్రబాబుకు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సానుభూతి సినీనటులు అవసరం అయ్యారు. ఆ ఉప ఎన్నిక సందర్భంగా వైయస్ జగన్ ప్రజలకు ఒక మాట ఇచ్చాడు. తాను కనుక అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తామంటూ నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే తొలిసారిగా ప్రకటన చేశారు. కాగా ఆ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పై విజయం సాధించారు.

నాడు ఉప ఎన్నికలో ఓడిపోయినా సరే నంద్యాల ప్రచారంలో ఇచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు మాటను వైయస్ జగన్ మర్చిపోలేదు. 2019 ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లతో జగన్ కి బ్రహ్మరథం పట్టారు. నాడు ఇచ్చిన మాటను అమలుచేసి మాట ఇస్తే మడమ తిప్పనని ముఖ్యమంత్రి జగన్ మరోసారి నిరూపించారు.ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90% మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ రికార్డు సృష్టించారు.ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తానని ఏ నియోజకవర్గంలో ప్రకటించారో అదే నియోజకవర్గాన్ని కొత్త జిల్లాగా మార్చిన తర్వాత ఆ నియోజకవర్గ పర్యటనకు వెళ్లడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ లోని నిబద్ధతను చాటి చెబుతుంది.

జగనన్న వసతి దీవెన పథకాన్ని వరుసగా రెండో ఏడాదిలో నంద్యాలలో జరిగే బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ విడుదల చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వరుసగా నవ రత్నాల పథకాలను అమలు చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా నంద్యాలలో జరిగే బహిరంగ కార్యక్రమంలో విడుదల చేయడానికి నిర్ణయించడం గమనార్హం. కాగా నంద్యాలలో ముఖ్యమంత్రి పాల్గొనే ఈ సభకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. దానికి కారణం కేబినెట్ ప్రక్షాళనతో పాటు కొత్త జిల్లాల్లో ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందో అన్న అంచనాల నడుమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికలకు ఈ సభ నుండే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమాయత్తం కానున్నారన్న అంచనాలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ సభకు విద్యార్థులతో పాటు జిల్లా ప్రతినిధులతో పాటుగా విద్యార్ధులు కూడా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారని సమాచారం.

కాగా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా దేశంలో ఎక్కడాలేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ అభ్యసించే వారికి రూ.20 వేల వరకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న జగనన్న వసతి దీవెన ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ జగనన్న వసతి దీవెన పథకంలో చేరాలని భావించే విద్యార్థులు నవశకం వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ డౌన్‌లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే జేవీడీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి, సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు అందిస్తే సరిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి