iDreamPost

ఫ్యాన్స్ దెబ్బకు అమితాబ్ సినిమాల నిషేధం

ఫ్యాన్స్ దెబ్బకు అమితాబ్ సినిమాల నిషేధం

కొన్ని గత చరిత్ర తాలూకు సంఘటనలు అసలు సినిమాలోని డ్రామా కంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే అలాంటి ఘటన ఒకటి చూద్దాం. 1982 సంవత్సరం. అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం నమక్ హలాల్ విడుదలకు రెడీ అవుతోంది. బెంగళూరు నగరం గాంధీ నగర్ లోని ఒక మెయిన్ థియేటర్ ని ప్రదర్శనకు ఎంచుకున్నారు. నిజానికి అందులో డాక్టర్ రాజ్ కుమార్ నటించిన హాలు జేను రిలీజ్ కు ముందే ప్లానింగ్ జరిగిపోయింది. కానీ ఆయన ఫ్యాన్స్ కి ఉత్సాహం ఎక్కువ. కంట్రోల్ చేయడం కష్టం. హాల్లోనే స్క్రీన్ ముందు హారతులు ఇవ్వడం, టపాసులు పేల్చడం, చెత్తా చెదారం వేయడం లాంటివి ఎక్కువగా చేసేవారు.

వీళ్ళకు భయపడిన ఎగ్జిబిటర్ హాలు జేను బదులు నమక్ హలాల్ వేసుకోవాలనుకున్నారు. కానీ రాజ్ కుమార్ అభిమానులు ముందుకు వచ్చి అలాంటివేవి చేయమని హామీ ఇచ్చి తమ హీరో సినిమా వచ్చేలా చేసుకున్నారు. కట్ చేస్తే ఇది కాస్తా అమితాబ్ కు తెలిసిపోయింది. కన్నడ కంఠీరవ బిరుదున్న హీరో తన ఫ్యాన్స్ ని అడ్డుపెట్టుకుని హిట్లర్ లా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నట్టు ఓ ట్రేడ్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యింది. దీంతో రాజ్ కుమార్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. కూలీ షూటింగ్ కోసం కర్ణాటకలోనే ఉన్న బిగ్ బి వద్దకు వెళ్లి అక్కడ ఆటంకాలు ఏర్పరిచి షూట్ ని అడ్డుకున్నారు. మరోవైపు నమక్ హలాల్ తో సహా అన్ని అమితాబ్ సినిమాలు ఆపేశారు.

దెబ్బకు సిచువేషన్ సీరియస్ గా మారిపోయిందని అర్థం చేసుకున్న అమితాబ్ నేరుగా రాజ్ కుమార్ వద్దకు వెళ్లి ఇదంతా కావాలని చేయలేదని ఎవరో చిచ్చు పెట్టారని వివరణ ఇచ్చి సారీ చెప్పారు. దీంతో కదిలిపోయిన పెద్దాయన ఇలాంటి ధోరణిని ఫ్యాన్స్ అయినా సరే తానెప్పుడు ప్రోత్సహించనని, ఇకపై జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చి అమితాబ్ కి ఆతిథ్యం ఇచ్చి పంపేశారు. తర్వాత ఈ వివాదం సద్దుమణిగి అమితాబ్ సినిమా కర్ణాటకలో కంటిన్యూ అయ్యాయి. ఏదైతే వద్దనుకుని నమక్ హలాల్ వేద్దామనుకున్న థియేటర్ లో అదే హాలు జేను ఏకంగా 35 వారాలు నాన్ స్టాప్ గా ప్రదర్శింపబడి బ్లాక్ బస్టర్ కావడం ఊహించని కొసమెరుపు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి