iDreamPost

గిల్ వరల్డ్ కప్ నుండి తప్పుకుంటే.. టీమిండియా పరిస్థితి ఏంటి?

గిల్ వరల్డ్ కప్ నుండి  తప్పుకుంటే.. టీమిండియా పరిస్థితి ఏంటి?

వరల్డ్ కప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 8న జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో కంగారులను మట్టికరిపించి విజయం సాధించింది. అయితే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను కలవర పెడుతున్న అంశం స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ అనారోగ్యానికి గురికావడమే. వన్డే వరల్డ్ కప్ లో గిల్ తన మెరుపు బ్యాటింగ్ తో టాప్ స్కోరర్ గా నిలుస్తాడని భావించిన తరుణంలో అసలు టోర్నీకే దూరమయ్యే పరిస్థితి వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గిల్ లేకుండా భారత్ వరల్డ్ కప్ లో ఆశించిన స్తాయిలో రాణిస్తుందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల జరిగిన ఆసియా కప్ తో సహా పలు క్రికెట్ ఫార్మాట్ లలో భీకర ఫాంలో ఉన్న గిల్ హఠాత్తుగా డెంగ్యూ భారిన పడ్డాడు. దీంతో వరల్డ్ కప్ లో భారత్ ఆడిన తొలి మ్యాచ్ కు గిల్ దూరమవ్వడంతో టీమిండియాకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలోనే భారత్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవేమో అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గిల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తను పూర్తిగా కోలుకుని ప్రపంచ కప్ లో పాల్గొనే అవకాశాలు సన్నగిల్లుతుండడంతో ఈ ప్రభావం టీమిండియాపై భారీగానే పడే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే భారత్ కెప్టెన్ తో కలిసి ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే గిల్ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించే సత్తా ఉన్నోడు. జట్టు గెలుపులో కీలక ప్లేయర్ గా మారిపోయాడు గిల్. టీమిండియా ఫ్యాన్స్ భారత్ లెజండరీ ప్లేయర్ కింగ్ కోహ్లీతో గిల్ ను పోల్చుతున్నారంటే అతడి ఆట తీరు ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఆసిస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

కాగా భారత్ ముందు కంగారులు ఉంచిన లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో తడబడింది. గిల్ ప్లేస్ లో ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ కనీసం ఒక్క ఓవరైనా ఆడకుండానే డకౌట్ అయి పెవిలియన్ బాటపట్టాడు. కాగా ఇప్పుడు గిల్ స్థానంలో బ్యాకప్ కోసం రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్ ను జట్టులోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే సమస్య తలెత్తుతోంది. వరల్డ్ కప్ ప్రిపరేషన్ లో కిషన్ మిడిల్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ చేశాడు.

ఇప్పుడు గిల్ అందుబాటులో లేకుండాపోతే అతనే ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా కిషన్ తో పాటు టీమ్ కి కూడా రిస్క్ లాంటిదే. ఇలా కాదని.. గిల్ కి రీ ప్లేస్ లో ఋతురాజ్, జైస్వాల్ లాంటి వారిని సెలెక్ట్ చేసినా.. ఇంత తక్కువ సమయంలో వారు మెంటల్ గా టోర్నీకి ఎలా సిద్ధమవుతారు అన్నది మరో ప్రశ్న. ఏదేమైనా.. గిల్ దూరమైతే టీమిండియా ప్లాన్స్ అన్నీ మారిపోయే అవకాశం ఉంది. అంత వరకు పరిస్థితి వెళ్లకుండా.. గిల్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి