iDreamPost

జగన్‌కు శ్రమ తగ్గించిన నిమ్మగడ్డ..!

జగన్‌కు శ్రమ తగ్గించిన నిమ్మగడ్డ..!

అవిభాజ్యం రాష్ట్రంలో సైతం ఎప్పుడు అమలు కాని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏపీలో అమలవుతున్నాయి. అడిగిన వారికే కాదు, అర్హత ఉంటే అడగని వారికి కూడా పథకం వచ్చిపడుతోంది. అమ్మ ఒడి నుంచి మొదలు పెడితే చేయూత, ఇంటి స్థలం వరకు దాదాపు నవరత్నాల్లో ఎన్నో కొన్ని రత్నాలు పేదల తలుపుతడుతున్నాయి. అది కూడా గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి రావాలంటే అనేక మంది నాయకులు మొక్కాలి, వాళ్ళ ఇంటి అరుగుల మీద కూర్చుని ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ దీనికి కూడా జగన్‌ ప్రభుత్వంలో అవకాశం లేకుండా చేసేసారు. నేరుగా వాలంటీరు వచ్చి నమోదు చేసుకోవడం, అర్హత ఉంటే మీకు ఈ పథకం వచ్చిందని అదే వాలంటీరు వచ్చి చెప్పడం జరిగిపోతోంది. అంతే కాకుండా ఏదో ఒక కటాప్‌ డేట్‌ ఇచ్చి అక్కడితో పథకం ఆపేయకుండా.. అర్హత ఉన్న వాళ్ళకు రాకపోతే మళ్ళీ దరకాస్తు చేసుకోండి అంటూ మళ్ళీమళ్ళీ అడిగి మరీ సంక్షేమ ఫలాలను వడ్డిస్తున్నాడు జగన్‌.

ఇది ప్రజలకు, అధికరపక్షానికి బాగానే ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకు మాత్రం కడుపురగలిపోయే విషయంగానే చెప్పాలి. అడిగిన వాళ్ళకు, అడగని వాళ్ళకు కూడా ఏదో ఒకటి ప్రభుత్వం తరపున ఇచ్చేస్తుంటే ఇక మనవైపు ఎవరు చూస్తారన్న ప్రశ్న వారికి మదిలోకి చేరుతోంది. దీంతో సంక్షేమ పథకాల అమలును అడ్డుకోవడంపై వారి దృష్టిని కేంద్రీకరిస్తున్నారన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే జనానికి బలపడిపోతోంది.

ఇళ్ళ స్థలాల పంపిణీని పదేపదే వాయిదాలు వేయడానికి కారణాన్ని ఆ పట్టాల పంపిణీ ప్రారంభ సభల్లో జగన్‌ చెప్పుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్షాల కారణంగానే పంపిణీ ఆలస్యమైందని సభావేదికలపై సీయం హోదాలో జగన్‌ వివరించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ పుణ్యమాని జగన్‌కు అవకాశం అక్కర్లేదంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం వద్దంటున్నప్పటికీ ఎన్నికలు పెడతానని ఉత్సాహ పడుతున్న కమిషనర్‌ నిమ్మగడ్డ వ్యవహారంలో అసలు ఉద్దేశం ఇప్పుడు జన సామాన్యానికి కూడా పూర్తిగానే అర్ధమైపోయిందంటున్నారు.

ఈ నెల 11వ తేదీన అమ్మ ఒడి పథకాన్ని లబ్దిదారుల ఖాతాలకు వేసేందుకు సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. సరిగ్గా ఇప్పుడే ఎన్నికల కమిషనర్‌కు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న ‘బాధ్యత’ గుర్తుకొచ్చేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ అమలులోకొచ్చిందంటూ తనదైన శైలిలో సంక్షేమ పథకం అమలుకు అడ్డుగా నిలబడిపోయారు. ఇది ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అన్న ప్రశ్నకు ఇప్పటికే జనంలో సమాధానం ఖరారైపోయింది. అయినప్పటికీ స్వామిభక్తి కోసం నిమ్మగడ్డ చేస్తున్న ఈ రచ్చను జనం కూడా కనిపెడుతూనే ఉన్నారు.

టీడీపీ హయాంలో రెండేళ్ళ పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరక్కుండా చూసుకున్న నిమ్మగడ్డ దానికి ఎటువంటి సమాధానం ప్రజలకు ఇప్పటి వరకు చెప్పనేలేదు. అయితే కోర్టు ముందున్న అంశం అని కూడా చూడకుండా, విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులు చెప్పేది వినకుండా రాత్రికిరాత్రే నోటిఫికేషన్‌ అంటూ ఇప్పుడు ప్రకటన జారీ చేసేసారు. ఈ తతంగం మొత్తం ఓ సారి పరికిస్తే.. మొత్తం వ్యవహారంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వహించాల్సిన పాత్రను నిమ్మగడ్డ చేపట్టినట్టుగా స్పష్టమైపోతోంది. తమకు తాముగా ప్రజల మనస్సులను గెల్చుకోలేక.. కేవలం ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక ఓటుపై మాత్రమే ప్రతిపక్షాలు ఆధారపడ్డాయన్న ఆరోపణలు జోరుగానే విన్పిస్తున్నాయి. ఇందుకోసం కూడా అతి సున్నితమైన మతం అంశాన్నే ప్రతిపక్షాలంతా ఏకమై ఇప్పటికే ఎత్తేసుకున్నారు.

అయితే అది కూడా ఆశించిన ఫలితం వచ్చిన దాఖలాల్లేకపోవడంతో ఇప్పుడు నిమ్మగడ్డేపైనే వారు నమ్మకం పెట్టుకున్నారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వపై వచ్చే పాజిటివ్‌ ఓటును చీల్చొచ్చన్న ఎత్తుగడను అమలు చేయడంలో భాగంగానే ప్రస్తుతం ఎన్నికల ప్రకటన ఎపిసోడ్‌ అని రాజకీయవర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న ఎపిసోడ్‌లో జగన్‌ ప్రభుత్వ ఉధృతిని అడ్డుకోవడం మాట అటుంచితే పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారన్న అపవాదునే నిమ్మగడ్డతో సహా, ప్రతిపక్షాలు ఎదుర్కొవాల్సి రావడం ఖాయంగానే కన్పిస్తోంది. అయితే జగన్‌ను అడ్డుకోవడం అన్నదానిపై దృష్టిపెట్టిన వారు ఈ విషయాన్ని మర్చిపోవడం.. పేదల వైపు నుంచి ఆలోచిస్తే మాత్రం బాధాకరమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి