iDreamPost

పట్టాభిపై 15 మంది దాడిలో నిజమెంత..?

పట్టాభిపై 15 మంది దాడిలో నిజమెంత..?

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో పట్టాభిరాం కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పట్టాభిరాం కాలికి చిన్న పాటి గాయం అయింది. తాను ఇంటి నుంచి కొద్ది దూరం రాగానే కారుపై 15 మంది దుండగులు దాడి చేశారని పట్టాభిరాం చెబుతున్నారు. ఇనుపరాడ్డు, కర్రలు, బండరాళ్లతో 15 మంది మూకుమ్మడిగా తనపై దాడి చేశారని చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నందుకే తనను హత్య చేయించాలని యత్నించారంటూ ఆరోపిస్తున్నారు. డీజీపీ, విజయవాడ కమిషనర్‌ తన వద్దకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తనపై జరిగిన దాడే నిదర్శనమంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

పట్టాభి మాటలు, విమర్శలు ఇలా ఉన్న తరుణంలో అసలు పట్టాభిపై జరిగిన దాడిపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు ఆగినప్పుడు సాధారణంగా దాడి జరుగుతుంది. అంటే ఇంటి వద్దనో లేక మధ్యలో ఆగితేనో, కార్యాలయం వద్దనో దాడి చేసేందుకు యత్నిస్తారు. కానీ ఇంటి వద్ద ఈ దాడి జరగలేదని పట్టాభే చెబుతున్నారు. ఇంటికి సమీపంలో చోటు చేసుకుంది. ఎందుకంటే… పట్టాభి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. అందుకే కావాలనే ఇంటి వద్ద దాడి చేయనట్లుగా ఉంది. ఇక 15 మంది ఇనుప రాడ్లు, కర్రలు, బండరాళ్లతో దాడి చేస్తే.. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలై ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పాక్షిక, శాశ్వత అంగవైకల్యం ప్రాప్తించే అవకాశం లేకపోలేదు. కానీ పట్టాభి మోకాలు వద్ద చిన్నపాటి గాయమైంది. అదీ కూడా కారు భాగాలు మోకాలికి బలంగా తగలడం వల్ల జరిగినట్లుగా ఉంది. నిజంగా ఇనుపరాడ్లు, కర్రలు, బండరాళ్లతో దాడి చేస్తే.. పట్టాభి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించగలం. కానీ అలా జరగలేదంటే ఇది స్వియ దాడి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దాడి తర్వాత పట్టాభి చెప్పిన మాటలు, చేసిన విమర్శలు వాస్తవ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆదిలో అమరావతి, ఆ తర్వాత తిరుమలలో శిలువ అంటూ చేసిన ప్రచారాలు తేలిపోవడంతో.. చివరకు దేవాలయాలు, దేవుళ్లపై కూడా టీడీపీ నేతలు దాడులకు పాల్పడి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ వారే ఉన్నారని తేలి, అరెస్ట్‌లు జరగడంతో.. అవన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రజల అటెన్షన్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ స్వియ దాడి ఆటను రక్తికట్టించేందుకు యత్నించిందనే అనుమానాలున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ.. అమరావతి నుంచి దేవాలయాలపై దాడుల వరకు వ్యవహరించిన తీరు నేపథ్యంలో పట్టాభి మాటలను ఎంత వరకు నమ్మవచ్చు అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రతి రోజు ఇంటి నుంచి వచ్చేటప్పుడు పట్టాభి వెంట అనుచరులు కూడా బయలుదేరుతారు. కానీ ఈ రోజు పట్టాభి ఒక్కడే రావడం పై అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.

పట్టాభిపై జరిగిన దాడి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికారై్డంది. ఇది టీడీపీ నేతలు, పట్టాభి ఊహించి ఉండరు.  ఆధారాలు లేవనే నమ్మకంతోనే పట్టాభి ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లున్నారు. ఇంటి నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు దాడి జరిగిందని పట్టాభి చెబుతుండగా.. సీసీ కెమెరాల దృశ్యాల్లో మాత్రం కారు ఆగే ఉంది. బైకుపై ఉన్న దుండగులు ముగ్గురు ఒక్కసారిగా కారు వద్దకు వచ్చారు. కారుపై దాడి చేశారు. కారు డోరు కూడా తీశారు. మరొకరు కారుపై దూరం నుంచి రాయి విసిరారు. ఆ తర్వాత బైక్‌పై పరారయ్యారు. తర్వాత అదే మార్గంలో పట్టాభి కూడా వెళ్లారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని పట్టాభి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలేంటనేది సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు ద్వారా తేలిపోతున్నాయి. కారుపై దాడి చేసిన దుండగులు, కారు డోరు తీసినా.. పట్టాభిపై మాత్రం దెబ్బ వేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ వ్యవహారంలో నిజానిజాలేంటన్నది త్వరలోనే పోలీసులు తేల్చడం ఖాయం. ఆ తర్వాత పట్టాభి, టీడీపీ నేతల ఆరోపణలు, విమర్శల్లో నిజమెంతనేది అధికారికంగా వెల్లడవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి