iDreamPost

పోటీ ఇచ్చే ప్రాంతంలోనే చతికిలపడిన టీడీపీ

పోటీ ఇచ్చే ప్రాంతంలోనే చతికిలపడిన టీడీపీ

అధికార వైఎస్సార్సీపీకి టీడీపీ అంతో ఇంతో పోటీ ఇవ్వగలుగుతున్న ప్రాంతం విశాఖ నగరమేనన్న అభిప్రాయం ఉంది. అయితే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చే విషయంలో ప్రభుత్వం చూపుతున్న దూకుడు, నగర పార్టీ వ్యవహారాలకు సంబంధించి టీడీపీ అధినేత అనుసరిస్తున్న వైఖరి, ఆ పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీరు కలిసి.. నగరంలో పార్టీ పుట్టి ముంచేస్తున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకునే పరిస్థితి కనిపిస్తోంది. నగారాభివృద్ధి దృష్ట్యా అధికార పార్టీతో కలిసి నడవాలని పలువురు టీడీపీ కార్పొరేటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు దూరం

గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా విశాఖ పార్లమెంటు జిల్లా పరిధిలో.. ఇంకా చెప్పాలంటే విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచి పార్టీ పరువు పోకుండా కొంత కాపాడారు. అయితే ప్రస్తుతం వారిలో ముగ్గురు దాదాపు దూరమయ్యారు. ఎన్నికలు జరిగిన నాటి నుంచే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన కుమారుడిని వైఎస్సార్సీపీలో చేర్పించి.. టీడీపీకి బై చెప్పేశారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇక మిగిలింది తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రమే. ఈ పరిణామాలతో నగరంలో ఇప్పటికే టీడీపీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది.

ఖాతరు చేయని కార్పొరేటర్లు

మార్చిలో జరిగిన మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి నగర పాలనాపగ్గాలు చేపట్టింది. 30 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ.. ఇప్పుడు తన కార్పొరేటర్లను చేజార్చుకునే పరిస్థితిని కొనితెచ్చుకుంది. విశాఖ నుంచి త్వరలోనే రాజధాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స ఇటీవల ప్రకటించడంతో ఉలిక్కిపడిన టీడీపీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ, నగర పాలనలో వైఫల్యాలు ఉన్నాయంటూ ధర్నాలు, నిరసన చేయాలంటూ.. ఏకంగా వారం రోజుల షెడ్యూల్ ఇచ్చింది. అయితే సమస్యలు లేకుండా, అన్నీ సజావుగా సాగుతున్నప్పుడు ఉత్తుత్తి ఆందోళనలు చేస్తే ప్రజల్లో మరింత చులకన అవుతామని ఒకరిద్దరు సీనియర్ కార్పొరేటర్లు హితవు చెప్పినా పట్టించుకోకుండా.. నిరసనల ప్రణాళికపై చర్చించేందుకు పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏర్పాటు చేసిన గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల సమావేశానికి ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన నలుగురు డుమ్మా కొట్టారు. హాజరైన ముగ్గురు కూడా పల్లా శ్రీనివాస్ బంధువులు కావడం విశేషం. దీంతో నిరసనల ప్లాన్ బెడిసికొట్టింది.

అభివృద్ధి కోసం కలిసి నడవాలని..

ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు టీడీపీ కార్పొరేటర్లు పార్టీకి దూరంగా జరిగి.. అధికార వైఎస్సార్సీపీకి చేరువకావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోనూ, జీవీఎంసీలోనూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నందున తమ డివిజన్లు, నగరం అభివృద్ధి చెందాలంటే ఆ పార్టీతో కలిసి నడిస్తేనే బాగుంటుందని పలువురు కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా.. చేరువ కావాలని మాత్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీరుపై కూడా వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన బంధువులను మాత్రమే ప్రోత్సహిస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గ ఇంఛార్జీలను పార్టీ అధిష్టానం నియమించాల్సి ఉండగా.. పల్లా శ్రీనివాస్ తన మేనల్లుడు ప్రసాదుల శ్రీనివాసును గాజువాక నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించడాన్ని.. పల్లా నియంతృత్వ ధోరణికి ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇవన్నీ కలిసి నగరంలో టీడీపీ మరింత పట్టుకోల్పోవడానికి దోహదం చేస్తున్నాయి.

Also Read : విశాఖ మానసిక వికలాంగుల పాఠశాల వెనుక అసలు కథేంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి