iDreamPost

విశాఖ ఉక్కు.. మళ్లీ లాభాల బాటలో.. కారణాలు ఏంటీ?

విశాఖ ఉక్కు.. మళ్లీ లాభాల బాటలో.. కారణాలు ఏంటీ?

గత ఏడాది చివరి వరకూ నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అధికారిక నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినెట్ కూడా దానికి ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం సాగుతోంది. కార్మికులు, నిర్వాసితులు ఆందోళనలు సాగిస్తున్నారు. అదే సమయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం సాగుతున్న సమయంలోనే ప్లాంట్ లాభాల బాట పట్టింది. విశాఖ ఉక్కు చరిత్రలోనే అత్యధికంగా ఉత్పత్తి, అమ్మకం, లాభాల శాతం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత లాభాలు ఎందుకు వస్తున్నాయనే చర్చ సాగుతోంది.

స్టీల్ ప్లాంట్ లాభాలు ఎంత

విశాఖ ఉక్కు టర్నోవర్‌ రూ.18వేల కోట్లుకు చేరింది. గత నాలుగు నెలల్లో సుమారు రూ.740 కోట్ల నికర లాభాలు సాధించినట్టు సీఎండీ పికె.రథ్ అధికారికంగా ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్ల టర్నోవర్‌ నమోదు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధిని సాధించామన్నారు. 2021 మార్చిలో తొలిసారి 7.11 లక్షల టన్నుల ఉక్కును అమ్మడం ద్వారా రూ.3,300 కోట్ల వ్యాపారం సాగిందన్నారు. ఇది గతేడాది కంటే 42 శాతం అధిక ఉత్పత్తి అంటూ వివరించారు.

స్టీల్ ప్లాంట్ ద్వారా సీఎస్‌ఆర్‌ నిధుల రూపంలో రూ.10 కోట్లు ఖర్చు చేశామని, అందులో ప్రధానమంత్రి నిధికి రూ.5 కోట్లు అందజేశామని తెలిపారు. 245 మంది మేనేజ్‌మెంట్‌ ట్రైనీల నియామకం ప్రక్రియలో ఉందన్నారు. రాయబరేలిలోని ఫోర్జేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని సీఎండీ ప్రకటించారు.

లాభాలకు అసలు కారణం ఏమిటీ

గత ఫిబ్రవరిలో సీఎం వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు. 2015వరకూ స్టీల్ ప్లాంట్ లాభాలను ప్రస్తావించారు. ఆతర్వాత నష్టాలు వచ్చినప్పటికీ 2020 డిసెంబర్ లో లాభాలు వచ్చిన విషయాన్ని పీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక డిసెంబర్ తర్వాత వరుసగా మూడు నెలల పాటు మంచి లాభాలు రావడంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ కారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే లాభాలకు అసలు కారణం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడం అని చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెంచడం కోసం వివిధ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చారు. కెపాసిటీ పెరిగినప్పటికీ కరోనా కారణంగా ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో చేసిన అప్పులకు వడ్డీలు కూడా పెరిగి ప్లాంట్ నష్టాల్లో ఉందనే ప్రచారానికి ఊతమిచ్చింది. తాజాగా కరోనా తర్వాత నిర్మాణ రంగం క్రమంగా పుంజుకుంటుండడంతో స్టీల్ వ్యాపారం పెరిగింది. దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ తన నిల్వలన్నీ అమ్మకాలు చేసేందుకు అవకాశం వచ్చింది. దాంతో టర్నోవర్, లాభాలు పెరిగేందుకు దోహదపడింది.

దాంతో పాటుగా మార్కెట్ లో స్లీల్ ధరలు కూడా పెరిగాయి. విశాఖ ఉక్కు లాభాలకు ఇది తోడ్పడింది. అంతేగాకుండా డిసెంబర్ నుంచి ముడి ఇనుము రవాణాకి ఆటంకాలు తొలగి ఉత్పత్తికి అవకాశం ఏర్పడింది. వర్షాకాలంలో కే కే లైన్ లో వచ్చే సమస్యల మూలంగా ఐరన్ ఓర్ సరఫరాకి సమస్యలుంటాయి. అవన్నీ తొలగిన తర్వాత ఉత్పత్తి పెరగడం, మార్కెట్ పుంచుకోవడం, ధరలు పెరగడం వంటి కారణాలన్నీ కలిసి స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభాల బాట పట్టేందుకు ఉపయోగపడింది. వరుసగా నాలుగు నెలల పాటు లాభాలు పెరుగుతూ ఉండడం ఆశావాహకంగా కనిపిస్తోంది.

లాభాలు వస్తున్నాయి కాబట్టి అమ్మకం ఆపేస్తారా..

వాస్తవానికి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం లాభనష్టాలను ప్రస్తావిస్తున్నా వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్టు లేదు. ఇప్పటికే ఎల్ ఐ సీ లాంటి భారీ లాభాలు గడించే సంస్థలనే అమ్మకానికి పెట్టినప్పుడు లాభనష్టాలు అనేవి పేరుకే తప్ప అమ్మకానికి ప్రాధాన్యత కాదని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ లోనే ప్రకటించారు. విశాఖ ఉక్కు అమ్మకానికి అసలు కారణం నష్టాలు కాదని తేల్చేశారు. దాంతో ఇప్పుడు లాభాలు వస్తున్నాయి కాబట్టి పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగుతుందనే అనుమానాలకు ఆస్కారం లేదని పలువురు భావిస్తున్నారు.

అయితే ఉక్కు కార్మికులు స్టీల్‌ప్లాంట్‌కు లాభాలు తెచ్చిపెడుతుంటే ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రశ్నిస్తోంది. సొంత గనులు కేటాయిస్తే సంవత్సరంలో రూ.2,500 కోట్ల లాభాలు తీసుకొస్తామని కన్వీనర్ అయోధ్యరామ్ అంటున్నారు. 20 ఏళ్లలో కేంద్రం ఒక్క రూపాయి కూడా స్టీల్‌ప్లాంట్‌కు పెట్టుబడి రూపంలో ఇవ్వకపోయినా ప్లాంట్ సొంత కాళ్లపై నిలబడుతోందన్నారు. మొత్తంగా విశాఖ ఉక్కు కోసం ఉద్యమం సాగుతున్న దశలో ప్లాంట్ లాభాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. మరికొన్ని నెలల పాటు ఇదే పంథాలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : ఉక్కు ప్రైవేటీకరణపై హైకోర్టులో పిల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి