iDreamPost

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. కేంద్రానికి నోటీసులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. కేంద్రానికి నోటీసులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందో.. లేదో గానీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు, ఆందోళనలు చేస్తున్న వారికి ఇది కొంత ఉపసమనం, ఉత్సాహం కలిగించే వార్త. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నష్టాలు వస్తున్నాయనే కారణంతో ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని జేడీ లక్ష్మీ నారాయణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్లాంట్‌ నష్టాలకు గల కారణాలపై దృష్టి పెట్టకుండా.. లాభాల బాట పట్టించేందుకు అనేక అవకాశాలు ఉన్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం విక్రయించాలనే నిర్ణయం తీసుకుకోవడం సరికాదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్లాంట్‌లో పని చేసే వేలాది మంది కార్మికుల భవిష్యత్‌ను, తెలుగు ప్రజల భావోద్వేగాలను కాపాడేలా ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జేడీ లక్ష్మీ నారాయణ తన పిటిషన్‌లో కోరారు.

నష్టాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమో లేదా మూసివేయడమో అనే విధానంతో ముందుకెళుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తోంది. నష్టాలలో ఉండేవే కాదు.. లాభాలు ఆర్జించే ఎల్‌ఐసీ వంటి సంస్థలను అమ్మేస్తోంది. వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం కాదంటూ కొత్త పల్లవిని అందుకుంది. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది.

దీన్ని వ్యతిరేకిస్తూ ప్లాంట్‌ కార్మికులు నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నారు. వారికి మద్ధతుగా ఏపీలోని అధికార పార్టీ వైసీపీ సహా ప్రతిపక్ష పార్టీలు ముందుకొచ్చాయి. అయినా కేంద్రం తన పట్టువీడడం లేదు. ప్లాంట్‌ కోసం భూములు ఇచ్చిన కుటుంబాల త్యాగాలను, ప్రస్తుతం ఆ భూముల విలువను దృష్టిలో పెట్టుకుని అయినా ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలనే వినతులు కేంద్రానికి వెళ్లాయి. అయినా స్టీల్‌ప్లాంట్‌ను విక్రయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పలు సందర్భాల్లో చెబుతున్నారు. ఈ క్రమంలో కార్మికులకు మద్ధతుగా జేడీ లక్ష్మీ నారాయణ న్యాయపోరాటానికి దిగారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేలా కోర్టుల్లో పరిణామాలు జరుగుతాయా..? లేదా..? చూడాలి.

Also Read : మార్ఫింగ్‌ ఫలితం.. దేవినేని ఉమాకు సీఐడీ తాఖీదులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి