iDreamPost

కబ్జాలపై కొరడా.. విశాఖలో కొనసాగుతున్న భూముల స్వాధీనం

కబ్జాలపై కొరడా.. విశాఖలో కొనసాగుతున్న భూముల స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహణ రాజధానిగా మారబోతున్న విశాఖలో రెవెన్యూ అధికారులు జూలు విదుల్చుతున్నారు. కబ్జాలపై కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తిస్తూ.. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బడా నేతలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, బినామాల పేరుతో, అనుచరుల పేరుతో విశాఖ చుట్టుపక్కలా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాటిని పక్కా ఆధారాలతో గుర్తించి ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణలు, వారి అనుచరుల ఆక్రమణల్లో ఉన్న కొన్ని భూములను విశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆనందపురం మండలం గుడిలోవ ప్రాంతంలో 8.81 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం ఆ భూమి విలువ 40 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలో ఈ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం పంచింది. ఆ తర్వాత అది బడాబాబుల చేతిలోకి వెళ్లిపోయింది.

కిమ్మనడం లేదు..

ఇటీవల విశాఖలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే సమయంలో టీడీపీ ప్రజా ప్రతినిధుల అనుచరులు.. ఆ భూములు మావి అంటూ నానా రచ్చ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా హల్‌చల్‌ చేశారు. వీరికి అండగా టీడీపీ అధినేత జూమ్‌లోకి వచ్చి మాట్లాడారు. తమ పార్టీ నేతల భూములు స్వాధీనం చేసుకోవడం కక్ష సాధింపు చర్య అంటూ గగ్గొలు పెట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి వత్తాసు పలికిన బాబు తీరు చూసిన ప్రజలు విస్తుబోయారు. అయితే తాజాగా స్వాధీనం చేసుకున్న 8.81 ఎకరాల భూమి విషయంలో మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.

సిట్‌ నివేదిక తర్వాత..

టీడీపీ ప్రభుత్వ హాయంలో విశాఖ చుట్టుపక్కల 12 మండలాల్లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ వ్యవహారంపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల మధ్య వివాదం కూడా నడిచింది. మంత్రి గంటా శ్రీనివాసరావు భూములు ఆక్రమిస్తున్నారంటూ.. మరో మంత్రి చింతకాయల అయన్న పాత్రుడు పరోక్షంగా ఆరోపించడం సంచలనమైంది. అప్పట్లోనే ఈ దందాపై సిట్‌ విచారణ జరగగా.. దాని తాలుకూ నివేదిక బయటకు రాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ వేసిన సిట్‌.. తన విచారణను పూర్తి చేసింది. తుది నివేదికను ప్రభుత్వానికి ఇటీవల సమర్పించింది. ఈ నివేదిక బట్టబయలు అయిన తర్వాత విశాఖలో జరిగిన భూ దందా పూర్తిగా వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం అప్పుడప్పుడు కొనసాగుతున్న భూముల స్వాధీన పక్రియ సిట్‌ నివేదికపై చర్యల తర్వాత వేగంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే కబ్జాదారులు నోళ్లు మూతపడగా.. రాబోయే రోజుల్లో వారందరూ అజ్ఞాతంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి