iDreamPost

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్​పై బాంబు పేల్చిన ఏబీ డివిలియర్స్!

  • Author singhj Published - 03:33 PM, Tue - 26 September 23
  • Author singhj Published - 03:33 PM, Tue - 26 September 23
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్​పై బాంబు పేల్చిన ఏబీ డివిలియర్స్!

ఇప్పుడు ఎక్కడ చూసినా వరల్డ్ కప్ గురించే చర్చ. మరికొన్ని రోజుల్లో క్రికెట్​లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్​కు తెరలేవనుంది. ఈసారి ప్రపంచ కప్​కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. కప్పు కొట్టాలని అన్ని జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో విజేతగా నిలిచి కోట్లాది మంది భారతీయుల మనసుల్ని మరోమారు గెలుచుకోవాలని భారత క్రికెటర్లు భావిస్తున్నారు. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్​లో నెగ్గిన నేపథ్యంలో.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్​ను రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో సత్తా చాటాలని, అతడు బాగా ఆడితే కప్పు మనదేనని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఆసియా కప్​లో రాణించిన కోహ్లీ.. అదే ఫామ్​ను వరల్డ్ కప్​లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో విరాట్​ను ఉద్దేశించి సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈసారి ప్రపంచ కప్​ను భారత్ గనుక సొంతం చేసుకుంటే కోహ్లీ వైట్​బాల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పే ఛాన్స్ ఉందని ఏబీడీ బాంబు పేల్చాడు. వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి విరాట్​కు ఇదే కరెక్ట్ టైమ్ అని డివిలియర్స్ అన్నాడు. 2027లో సౌతాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్​లో ఆడేందుకు కోహ్లీ ఇష్టపడతాడని తనకు తెలుసన్నాడు.

‘సౌతాఫ్రికా (2027 ప్రపంచ కప్ కోసం) రావడానికి కోహ్లీ ఇష్టపడతాడని నాకు తెలుసు. కానీ అదెంతో కష్టం. ఆ వరల్డ్ కప్​కు ఇంకా చాలా సమయం ఉంది. ముందు ప్రస్తుత ప్రపంచ కప్​పై దృష్టిపెడదాం. ఒకవేళ టీమిండియా ఈసారి కప్పు గెలిస్తే కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది. నేను టెస్టు క్రికెట్, ఐపీఎల్లో మాత్రమే ఆడతాను, నా కెరీర్ ఆఖరి రోజుల్ని ఎంజాయ్ చేస్తానని కోహ్లీ చెప్పొచ్చు. కానీ అతడు ప్రస్తుతం పూర్తి ఫిట్​గా ఉన్నాడు. అతను ఎప్పటికప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. కాబట్టి మరికొన్నాళ్లు ఆడాలని కోహ్లీ భావించొచ్చు’ అని యూట్యూబ్​ ఛానల్​లో డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: ఆ రోజు పాంటింగ్ బ్యాట్​లో స్ప్రింగులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి