iDreamPost

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి కోహ్లీనే కారణమా?

  • Published Oct 16, 2023 | 5:00 PMUpdated Oct 16, 2023 | 5:00 PM
  • Published Oct 16, 2023 | 5:00 PMUpdated Oct 16, 2023 | 5:00 PM
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి కోహ్లీనే కారణమా?

దాదాపు 100 ఏళ్లకు పైగా క్రికెట్‌ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలనే కల.. త్వరలోనే నిజం కానుంది. 2028లో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని కూడా భాగం చేస్తూ ఇటీవల ఒలింపిక్స్‌ కమిటీ అధికారికంగా ప్రకటించింది. క్రికెట్‌లో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్‌లను లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో భాగం చేశారు. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది. అయితే.. క్రికెట్‌కు నానాటికీ పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చారు. ఒలింపిక్స్‌ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్‌ అభిమానులుతో పాటు క్రికెటర్లు, దిగ్గజ మాజీ క్రికెటర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశాడు.

అయితే.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ భాగం అవ్వడానికి టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం ఓ కారణమంటూ తాజాగా ఓ వాదన వినిపిస్తోంది. అందుకు కారణం కోహ్లీకి ఉన్న క్రేజ్‌. విరాట్‌ కోహ్లీకి ఇండియాలో ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ ఫ్యాన్‌ బేస్‌ కోట్లలో ఉంటుంది. ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. అంతెందుకు మన శత్రు దేశం పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకి ఫ్యాన్స్‌ ఉన్నారు. అది కోహ్లీ రేంజ్‌. అలాంటి ఆటగాడికి సోషల్‌ మీడియాలో కూడా బీభత్సమైన ఫాలోయింగ్‌ ఉంది. కోహ్లీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అన్ని కలుపుకుని అతనికి దాదాపు 314 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను తీసుకుంటే.. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌లో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. వరల్డ్‌లోనే అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న మూడో అథ్లెట్‌ కోహ్లీనే. ఇదే విషయాన్ని ఎల్‌ఏ లోకల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ డైరెక్టర్‌ నికోలో కాంప్రియాని ప్రస్తావిస్తూ.. లెబ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ వంటి ప్రముఖల కంటే కూడా కోహ్లీకి సోషల్‌ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్‌ కలిగి ఉన్నాడని, క్రికెట్‌కు ఉన్న ఆదరణను దీన్ని బట్టి తెలుసుకోవచ్చని అర్థం వచ్చేలా మాట్లాడాడు. అలాగే ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ను చేర్చుతున్నట్లు వేసిన పోస్టర్‌లో కూడా కోహ్లీ ఫొటోనే వాడటం విశేషం.  దీంతో.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ భాగం కావడానికి కోహ్లీ కూడా ఒక కారణం అంటూ ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ టైమ్‌లో రోహిత్‌ చేసిన పనితో సీన్‌ మొత్తం మారిపోయింది: కుల్డీప్‌ యాదవ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి