iDreamPost

APలో వాలంటీర్ వ్యవస్థపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు!

APలో వాలంటీర్ వ్యవస్థపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల వల్ల రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు తెలిపారు. పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ కూడా చేశారు. వైసీపీ నేతలు, మంత్రులు అందరూ పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడు టీడీపీ ఎంపీ కేసినేని నాని వాలంటీర్ వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల్లో టీడీపీ- జనసేన పొత్తులో ఉంటాయనే వార్తల నేపథ్యంలో ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ప్రజలకు మంచి చేసే ఏ వ్యవస్థను అయినా తాము స్వాగతిస్తామంటూ కేశినేని తెలిపారు. వాలంటీర్లు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పని చేయాలని కోరారు. అందరినీ, ప్రతి వ్యవస్థను విమర్శించడం కూడా సరైన పద్ధతి కాదంటూ కేశినేని సూచించారు. చంద్రబాబు హయాంలో పని చేసిన జన్మభూమి కమీటల గురించి గుర్తు చేశారు.

అప్పట్లో జన్మభూమి కమిటీలే.. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటూ వ్యాఖ్యానించారు. అయినా వాలంటీర్ వ్యవస్థ బాగుంటే కొనసాగిస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనను గుర్తు చేశారు. వాలంటీర్లు కావచ్చు.. అధికారులు కావచ్చు అందరూ రాజకీయాలకు అతీతంగా పని చేయాలని సూచించారు. నలుగురు ఐదుగురు తప్పు చేశారు అని.. అందరినీ ఒకే గాటికి కట్టేయడకూడదు అంటూ వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్లు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపడం, దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఒక వ్యవస్థపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాందటూ హితవు పలుకుతున్నారు. మరోవైపు జనసేన పార్టీ వాలంటీర్ వ్యవస్థపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం జరుగుతోంది. ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అంటూ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి