iDreamPost

విజయ రాఘవన్ రిపోర్ట్

విజయ రాఘవన్ రిపోర్ట్

బిచ్చగాడు రూపంలో ఒక్క సినిమాతోనే అమాంతం తెలుగు మార్కెట్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత వరస పరాజయాలతో దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఒకదశలో ఇతని సినిమా అంటే బయ్యర్లు ఎగబడే పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు తన మూవీ వస్తోందంటేనే ప్రేక్షకుల్లో కనీస ఆసక్తి తగ్గిపోయే దాకా వచ్చింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఆపకుండా దండయాత్రలు చేస్తూనే ఉన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం విజయ రాఘవన్ నిన్న గల్లీ రౌడీతో పాటు థియేటర్లలో అడుగు పెట్టింది. ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో జనానికి దీని గురించి పెద్దగా ఐడియా లేదు. టాక్ నే నమ్ముకున్న ఈ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

ఇది తల్లి సెంటిమెంట్ ని సమాంతరంగా నడిపిస్తూ సాగే పొలిటికల్ డ్రామా. విజయ్ రాఘవన్(విజయ్ ఆంటోనీ)లక్ష్యం ఐఎఎస్ ఆఫీసర్. అమ్మ కోరిక కూడా అదే కావడంతో పరీక్షలకు సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటాడు. ఇతను ఉండే మాస్ కాలనీలో ఓ రౌడీ గ్యాంగ్ తో అనుకోకుండా రాఘవన్ కు గొడవ జరుగుతుంది. దీంతో వాళ్ళు కీలకమైన ఇంటర్వ్యూకు వెళ్తున్న రాఘవన్ మీద దాడి చేసి ఆ అవకాశాన్ని పోగొడతారు. దీంతో మనస్థాపానికి గురైన ఇతనికి తల్లి ధైర్యం చెబుతుంది. ఆవిడకు రాజకీయంతో ఒక గతం ఉంటుంది. రాఘవన్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు యుద్ధం. అదేంటనేది తెరమీద చూడాలి

ఇంకా బిచ్చగాడు హ్యాంగోవర్ లోనే ఉన్న విజయ్ ఆంటోనీ మరోసారి మదర్ సెంటిమెంట్ ఉన్న కథనే ఒక చేయడం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దర్శకుడు ఆనంద్ కృష్ణన్ డిజైన్ చేసిన కొన్ని ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ కథనం చాలా చోట్ల నెమ్మదిగా సాగడం, అవసరానికి మించిన డ్రామా జొప్పించడంతో సినిమా గ్రాఫ్ కిందా మీద పడుతూ ఫైనల్ గా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. క్యాస్టింగ్, మంచి బడ్జెట్ ఉన్నా ల్యాగ్ వల్ల ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయారు. కాకపోతే విజయ్ ఆంటోనీ గత నాలుగైదు సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అనే ఊరట తప్ప మరీ ప్రత్యేకంగా చూసే తీరాలనే మ్యాటర్ ఇందులో తక్కువే

Also Read : అన్నాబెల్లె సేతుపతి రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి