iDreamPost

మార్ఫింగ్‌ ఫొటోలే కాదు.. వీడియోలు కూడా ఉంటాయా..? – పనబాక లక్ష్మీ

మార్ఫింగ్‌ ఫొటోలే కాదు.. వీడియోలు కూడా ఉంటాయా..? – పనబాక లక్ష్మీ

రాజకీయాలు ఎప్పుడూ వింతగానే ఉంటాయి. రాజకీయ నేతలు చేసే ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఎన్నికలంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు, ప్రతివిమర్శులు ప్రజలకు వినోదాన్ని పంచుతాయి. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ, టీడీపీ నేతలు ప్రజలకు తమ ప్రకటనలతో పసందైన వినోదాన్ని పంచుతున్నారు.

టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫునే కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో పనబాక లక్ష్మీ టీడీపీ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుపై పనబాక లక్ష్మీ విమర్శలు చేశారు. గతంలో పనబాక లక్ష్మీ చేసిన విమర్శలను బీజేపీ తెరపైకి తెచ్చింది. నాడు.. బాబు గురించి నేటి టీడీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి పనబాక మాటాల్లో.. అంటూ పనబాక మాట్లాడిన వీడియోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు. దీంతో సోము వీర్రాజు, పనబాక లక్ష్మీల మధ్య సవాళ్లు, మాటల తూటాలు పేలుతున్నాయి.

Also Read : రత్నప్రభ నిజాలు దాచారా..?

సోము వీర్రాజు పోస్ట్‌ చేసిన వీడియోలో ఉన్నది తాను కాదని పనబాక లక్ష్మీ అంటున్నారు. అది మార్ఫింగ్‌ వీడియో అంటూ చెప్పుకొచ్చారు. మార్ఫింగ్‌ చేయలేదని సోము వీర్రాజు దేవుడు ముందు ప్రమాణం చేయగలరా..? అంటూ ప్రశ్నించారు. అది మార్ఫింగ్‌ వీడియో అని తాను ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేస్తానని సవాల్‌ విసిరారు. పనబాక సవాల్‌కు సోము కూడా స్పందించారు. అ వీడియోలో ఉన్నది పనబాక లక్ష్మీనే.. అందులో అవాస్తవం లేదు. అలాంటప్పుడు నేను ప్రమాణం చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. కావాలంటే పనబాక లక్ష్మీనే ప్రమాణం చేసుకోవాలని బంతిని పనబాక కోర్టులోకి నెట్టారు సోము వీర్రాజు. అది మార్ఫింగ్‌ వీడియో అయితే పోలీస్‌ స్టేషన్‌ కేసు కూడా పెట్టుకోవచ్చన్నారు కమలదళపతి.

ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సర్వసాధారణం. ఆ తర్వాత విమర్శలు చేసిన నేతే.. సదరు పార్టీ పంచన చేరడం సాధారణంగా జరుగుతోంది. ఇప్పుడు పనబాక లక్ష్మీ విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో తాను కాంగ్రెస్‌పార్టీలో ఉన్నాను.. ఆ పార్టీ విధానాలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేశాను. చంద్రబాబుపై విమర్శలు చేశాను.. ఇప్పుడు టీడీపీలో ఉన్నాను. ఈ పార్టీ విధానాలకు అనుగుణంగా పని చేస్తాను. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తాను. ఇందులో తప్పేముంది..? అని పనబాక లక్ష్మీ ఒక్క వాక్యంతో తేల్చేస్తే.. వీడియోపై ఇంత రచ్చ ఉండేది కాదు. కానీ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. అది మార్ఫింగ్‌ వీడియో అంటూ వాదించడం వల్ల నవ్వులపాలవడం తప్పా.. మరే ప్రయోజనం ఉండదు.

Also Read : ఇవేం మాటలు అచ్చెన్నా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి