iDreamPost

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకు జీవిత ఖైదు

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకు జీవిత ఖైదు

ఉన్నావ్ అత్యాచార కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవిత ఖైదు విధిస్తు తీస్ హజారీ కోర్టు తీర్పు చెప్పింది. గతంలోనే కుల్దీప్ సింగ్ ను దోషిగా నిర్ధారించిన తీస్ హజారీ కోర్టు శిక్షను మాత్రం ఈరోజు ఖరారు చేస్తూ తుదితీర్పు ఇచ్చింది.

రెండున్నర సంవత్సరాల క్రితం 2017 జూన్ 4న, ఉన్నావ్ కి చెందిన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శశిసింగ్ అనే మహిళ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగర్‌ వద్దకు తీసుకెళ్లింది. కాగా తనపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ తన అనుచరులతో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నించాడు.

సాక్ష్యాలు తారుమారు చేయడానికి, బాధితురాలితో సహా బాధితురాలి కుటుంబ సభ్యులను చంపించడానికి కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ వెనుకాడలేదు. పైగా బాధితురాలి తండ్రిపైనే ఎదురుకేసు పెట్టించి తీవ్రంగా కొట్టడంతో పోలీసు కష్టడీలోనే బాధితురాలి తండ్రి మరణించాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అత్యంత వివాదాస్పదం అయింది.

సబ్ జైలులో ఉన్న బంధువుని కలవడానికి వెళ్తున్న సమయంలో ఒక ట్రక్కు బాధితురాలు ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టడంతో బాధితురాలి సమీప బంధువు మృతి చెందగా బాధితురాలికి ఆమె తరపు లాయరుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీనితో యోగి సర్కార్ పై ఒత్తిడి పెరిగింది. విచారణను కూడా ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు బదిలీ చేసారు. విచారణలో బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ నేరం చేసినట్లు కోర్టు నిర్దారించి జీవితఖైదు విధించింది. బాధిత కుటుంబానికి 25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో 15 లక్షలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. నెలరోజుల్లో బాధితురాలికి పరిహారం చెల్లించకపోతే యూపీ ప్రభుత్వం బాధితురాలికి పరిహారం చెల్లించాలని, కుల్దీప్ సింగ్ సెంగార్ ఆస్తులు అమ్మేసి అయినా పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు నివ్వడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి