iDreamPost

గాడ్ ఫాదర్ లో ఊహించని పాత్ర

గాడ్ ఫాదర్ లో ఊహించని పాత్ర

ఇటీవలి కాలంలో చిన్న సినిమాల నిర్మాతలకు స్టార్ గా మారిన సత్యదేవ్ కెరీర్ గత ఏడాది నుంచి మంచి స్పీడ్ లో ఉంది. రీజనబుల్ బడ్జెట్ లో ఇతనితో చిత్రాలు తీస్తే ఈజీగా లాభాలు గ్యారెంటీ అనే నమ్మకం ప్రొడ్యూసర్లలో నెలకొంది. థియేటర్లో సమస్యలు వచ్చినా ఓటిటి డీల్ తో గట్టెక్కే ఛాన్స్ ఉండటంతో తనతో గేమ్ చాలా సేఫ్ గా ఉంటోంది. ఈ కారణంగానే గత ఏడాది ఏకంగా మూడు డైరెక్ట్ డిజిటల్ రిలీజులు అందుకున్నాడు సత్యదేవ్. తనను లీడ్ రోల్ గా పెడితే వర్కౌట్ అవుతుందన్న భరోసా కలుగుతున్న తరుణంలో సత్యదేవ్ ఒక మెగా రిస్క్ కి సిద్ధపడుతున్నాడని ఫిలిం నగర్ టాక్. కెరీర్ బ్రేక్ ఛాన్స్ ఉన్నా కూడా ఇది కొంచెం సాహసమే అంటున్నారు

వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందబోయే లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్(ప్రచారంలో ఉన్న టైటిల్)లో సత్యదేవ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కి లాక్ అయినట్టుగా తాజా అప్ డేట్ ప్రచారంలోకి వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ లో దీన్ని వివేక్ ఒబెరాయ్ చేశాడు. నటనకు చాలా స్కోప్ ఉంది కానీ ఇది పచ్చి విలనీ టైపు. మంచి ఆఫర్లు వస్తున్న టైంలో సత్యదేవ్ ఇలా విలన్ గా ట్రై చేయడం ఏమిటా అని అనుమానం రాకపోదు. తన ఆరాధ్య నటుడి సినిమాలో వచ్చే ఏ వేషమైనా ఇలాంటి యూత్ హీరో సాధారణంగా వదులుకోడు. అందుకే ఓకే చెప్పి ఉండొచ్చు.

వాస్తవానికి సత్యదేవ్ కి ఇచ్చిన పాత్ర కథలో చాలా కీలకంగా ఉండే హీరో తమ్ముడి క్యారెక్టర్ అని గతంలో వచ్చింది. కానీ ఇప్పుడేమో కాదంటున్నారు. ఒకవేళ ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త నిజమైతే మరి ఆ రోల్ ఎవరికి వెళ్లిందనేది ఆసక్తికరం. హీరోయిన్ గా నయనతారను లాక్ చేసినట్టు చెబుతున్నారు కానీ ఇంకా క్లారిటీ లేదు. ఈ నెలలోనే ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ రివీల్ చేయబోతున్నట్టు తెలిసింది. అప్పుడే అన్ని విషయాలకు సంబంధించిన స్పష్టత వచ్చేలా ఉంది. చిరంజీవి ప్రస్తుతానికి మంచి స్పీడ్ మీదున్నారు. వేదాళం రీమేక్ కూడా అతి త్వరలోనే ప్రారంభించేలా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయట

Also Read : ఇప్పుడు ముందుకు రావాల్సింది నిర్మాతలే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి