iDreamPost

ఎంటర్ టైన్మెంట్ ఛానెళ్లకు దినదిన గండం

ఎంటర్ టైన్మెంట్ ఛానెళ్లకు దినదిన గండం

కోవిడ్ 19 దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతోంది. ఫలానా రంగం అనే తేడా లేకుండా సర్వం దీని వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతోంది. దీనికి వినోద రంగం మినహాయింపు కాదు. ఇప్పటికే షూటింగులు, థియేటర్లు మూతబడి లక్షలాది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి సాధారణం కావడానికి ఇంకా చాలా రోజులు అవసరం పడేలా ఉండటంతో వాళ్లకు రోజు దినదిన గండంగా మారనుంది. ఇక ఎంటర్ టైన్మెంట్ నే ఆధారంగా చేసుకున్న టీవీ ఛానెళ్ల మనుగడ కూడా కష్టకాలంలోనే కొనసాగనుంది.

ఇప్పటికే సీరియల్స్ దాదాపుగా అన్నింట్లోనూ నిలిచిపోయాయి. ప్రధాన ఆదాయ వనరుగా ఉండే ఇవి ఆగిపోవడం అంటే దెబ్బ మాములుగా ఉండదు. ఒకటి అరా తప్ప రియాలిటీ షోలు కూడా బ్రేక్ వేసుకున్నాయి. వీటి స్థానంలో పాత కొత్త సినిమాలు వేసుకుంటూ కాలం గడుపుతున్నాయి చానెల్స్. దూరదర్శన్ ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వచ్చిన రామాయణం, మహాభారతం టెలికాస్ట్ చేసే పనిలో పడగా తెలుగులో సైతం పాత ఎపిసోడ్లు, గతంలో పేరు తెచ్చుకున్న షోలను మళ్ళీ వేసే పనిలో పడ్డాయి.

కాకపోతే ఈ గడ్డుకాలంలో న్యూస్ ఛానెల్స్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. కరోనాకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను లైవ్ అప్ డేట్స్ ద్వారా అందిస్తుండటంతో వీటి మీద జనం ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ కు అలవాటు పడినవాళ్లు ఛానల్స్ ని పక్కనపెట్టేసి ఎంచక్కా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు.

సీరియల్స్ పునఃప్రారంభమయ్యే దాకా మహిళా లోకం రెగ్యులర్ ఛానెల్స్ వైపు మొగ్గు చూపడం కష్టమే. స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 3ని రీ టెలికాస్ట్ చేస్తోంది. ఈటీవీ, జీటీవీ వగైరా సినిమాలతో సర్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇదంతా యధాతథ స్థితికి రావడానికి టైం బాగానే పట్టేలా ఉంది. ఊరట కలిగించే విషయం ఏంటంటే థియేటర్లు మూతబడ్డాయి కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఛానల్స్ లో ఏది వస్తే అది చూడటం తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేదు. ఉన్నంతలో ఏది మంచి వినోదాన్ని ఇస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి అనేదే ఇక్కడ కీలకం. అప్పటిదాకా ఈ కష్టాలు తప్పవు మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి