iDreamPost

ముందు అడగాల్సింది చంద్రబాబును.. రెడ్డి గారు..!

ముందు అడగాల్సింది చంద్రబాబును.. రెడ్డి గారు..!

ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఉందో లేదో అనే అనుమానం వచ్చే పార్టీ కాంగ్రెస్‌. పూర్వవైభవం కాకపోయినా.. పునరుజ్జీవం కోసం ఆ పార్టీ అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. ఇటీవల రాష్ట్ర, డీసీసీ పదవులు భర్తీ కూడా చేశారు. విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో ఒకరిద్దరు యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో తులసి రెడ్డి ఒకరు. ఆ పార్టీ తరఫున టీవీ డిబెట్లు.. ప్రెస్‌మీట్లలో కనిపిస్తుంటారు. 20 సుత్రాల ప్రణాళిక కమిటీచైర్మన్‌గా తులసిరెడ్డి సుపరిచితులు.

అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా, ప్రతిపక్ష పార్టీ హోదాలేకపోయినా సరే.. కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజల తరఫున పోరాడుతుందని నిరూపించేందుకు తులసి రెడ్డి తాపత్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీ అంటే.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల గొంతుకను వినిపించాల్సిందే. అయితే ఇక్కడ.. సమస్య మూలాలను వదిలి విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.

తాజాగా జగన్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన జగనన్న వసతి దీవెన పథకంపై తులసి రెడ్డి విమర్శలు గుప్పించారు. పాత పథకాలకే పేర్లు మారుస్తున్నారంటూ విమర్శించారు. అదే సమయంలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ పాత బకాయల సంగతేంటంటూ ప్రశ్నించారు. తులసిరెడ్డి తీరు బాగానే ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించారు. అయితే దీనికి ముందు ఆయన చంద్రబాబును ఎండగట్టాలి. ఎన్నికల సమయంలో అన్ని పథకాల డబ్బులు తెచ్చి పసుపు – కుంకుమ కింద చంద్రబాబు పంచారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆపేశారు. ఎన్నికల సమయంలోనే సినీనటుడు మంచు మోహన్‌ బాబు.. ఫిజురియంబర్స్‌మెంట్‌ బకాయలు విడుదల చేయాలని తిరుపతిలో తన విద్యాసంస్థల్లో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తులసిరెడ్డి గుర్తు చేసుకోవాలని పరిశీలకులు చెబుతున్నారు. బాబు పెట్టిన పెండింగ్‌ బకాయలు మొత్తం 60 వేల కోట్ల రూపాయాలంటే ఆశ్చర్యం కలగకమానదు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తోంది. 40 ఏళ్ల అనుభవం ఉందని, మూడుసార్లు ముఖ్యమంత్రి, బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా ఎందుకు చేశావని.. తులసిరెడ్డి ప్రశ్నించి.. ఆ తర్వాత బకాయలు విడుదల చేయాలని జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తే ఎంతో గౌరవంగా ఉండేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దిశగా తులసి రెడ్డి ఆలోచన చేయాలని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి