iDreamPost

అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది.. ఎం.. ?

అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది.. ఎం.. ?

గతంలో బాలకృష్ణ నటించిన సింహా అనే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. “అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏ..” అని హీరో పోలీస్ అధికారిని ప్రశ్నిస్తాడు.. గతంలో కొందరు దుర్మార్గం చేసినపుడు మాట్లాడని పోలీస్ అధికారి హీరోతో కొన్ని అంశాలు ప్రస్తావించే సీన్ లో ఈ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఈ డైలాగ్ నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సరిగ్గా సరిపోతుంది. ఆయనే 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి.

తాజాగా ఈయన ఏపీ ప్రభుత్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇటీవల మాజీసీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్ర చేసేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా ఆయనను వైసీపీ శ్రేణులు, పలు ప్రజా సంఘాల నేతలతోపాటు, ప్రజలు అడ్డుకున్న విషయం తెలిసిందే.. ఈ ఘటనపై తులసి రెడ్డి స్పందిస్తూ అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి మరియు డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. అయితే ఇదే తులసిరెడ్డి గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో జరిగిన ఏ ప్రజా వ్యతిరేక ఘటనపైనా ఈ స్థాయిలో కాదు కదా.. కనీసం సాధారణ స్థాయిలోనూ స్పందించే ప్రయత్నం చేయలేదు. ప్రజా ఉద్యమాలను అడ్డుకున్నపుడూ ప్రశ్నించలేదు. లాండ్ ఆర్డర్ అదుపు తప్పిన ఘటనల్ని ఖండించలేదు.. విద్యార్ధులపై లాఠీలు విరిగినపుడు తన గొంతెత్తలేదు. కుల ఉద్యమాల చాటున సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినప్పుడు కిమ్మనలేదు. కానీ తాజాగా విశాఖ ప్రజలు తమ ప్రాంతానికి రాబోతున్న రాజధానిని చంద్రబాబు వ్యతిరేకించడంతో.. తమకు కావాల్సిన రాజధానికి మద్దతివ్వాలని చంద్రబాబును కోరారు. ఈక్రమంలోనే అడ్డుకున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతానికైనా ఈ తరహా ఘటనలు జరిగినపుడు ప్రజలు ఇలా స్పందించడం అనేది సాధారణంగా జరిగే విషయం. అయితే దీనికే దశబ్ధాల రాజకీయ చరిత్ర ఉన్న తులసిరెడ్డి చంద్రబాబును ప్రజలు అడ్డుకున్న కారణానికే ఏకంగా హోంమంత్రి, డీజీపీ తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబం పట్ల రాష్ట్ర పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను కొట్టుకుంటూ, బండ బూతులతో దుర్భాషలాడారు. ముద్రగడ నివాసముండే కిర్లంపూడిలో రోజుల తరబడి 144సెక్షన్ పెట్టి ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోని తీసుకున్నపుడు, అదే ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమంలో తునిలో రైలు దగ్ధం జరిగినపుడు, పలు హింసాత్మక ఘటనలతో లాండ్ ఆర్డర్ అదుపు తప్పినపుడు, ముఖ్యంగా విధ్వంసాలకు పాల్పడ్డారంటూ అమాయక కాపు యువకులను పోలీసులు నిర్భంధించి, భయ బ్రాంతులకు గురిచేసి దారుణంగా కొట్టినపుడు ఈ తులసిరెడ్డి ఎక్కడున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

విద్యార్ధులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కించాలని ఉద్యమించినపుడు, అంగన్ వాడీ కార్యకర్తలు చంద్రబాబు హామీ ఇచ్చినమేరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేసినపుడు విజయవాడ రోడ్లపై మహిళలు, విద్యార్ధులని చూడకుండా దారుణంగా కొట్టి పోలీసు కేసులు నమోదు చేసినపుడు ఈ దశాబ్ధాల అనుభవం ఉన్న రాజకీయ నేతలంతా ఏమైపోయారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో పంట పొలాలు తగులబెట్టి అమాయక రాజధాని ప్రాంత యువకులను హింసించినపుడు, బలవంతపు భూ సేకరణలు చేసినపుడు, ప్రత్యేకహోదా ఉద్యమంలో గొంతెత్తిన విద్యార్ధుల హక్కులను హరించినపుడు న్యాయం తరపున కనీసం మాట్లాడని తులసి రెడ్డి ఇప్పుడెందుకు ఏకంగా రాజీనామాల డిమాండ్ వరకూ ఎందుకు వెళ్తున్నారో అర్ధమవుతోంది.

కాంగ్రెస్ పార్టీలో ఇన్నేళ్ల తరబడి ఉన్నా ఆయనలో చంద్రబాబు అభిమాని పదిలంగా ఉంటారని చెప్తుంటారు. పేరుకు బద్ద వ్యతిరేక రాజకీయ పార్టీలుగా ఉంటున్నా కొందరు నాయకులు తల్లిలాంటి పార్టీలకు వెన్నుపోటు వ్యవహారశైలితో ప్రవర్తిస్తూ ప్రజాసమస్యల అజెండాగా కాకుండా వ్యక్తిగత, రాజకీయ అజెండాతో ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ కోవలో ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు బీజేపీకి, బీజేపీలో ఉన్నత స్థానంలో ఉన్న కొందరు నాయకులు టీడీపీకి తొత్తులుగా పనిచేస్తుంటారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పై కూడా ఈ తరహా విమర్శలే తరచూ పెద్దఎత్తున వినిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి రాజకీయం అపారమైన అనుభవం ఉన్న కొందరు తులసి రెడ్డి వంటి నాయకులు కూడా చేస్తున్నారని ప్రజలకు అనిపించడం నిజంగా బాధాకరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి