iDreamPost

శ్రీవారి ఆస్తి ఎంత..? శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైన టీటీడీ..!

శ్రీవారి ఆస్తి ఎంత..? శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైన టీటీడీ..!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తి ఎంత..?.. తిరుమల శ్రీవారి భక్తులతోపాటు ప్రజలందరి మెదళ్లలో ఎప్పుడూ నలిగే ప్రశ్న ఇది. కలియుగంలో శతాబ్ధాల తరబడి ప్రజలు శ్రీ వారిని అత్యంత భక్తితో కొలుస్తున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి వస్తారు. ఇటీవల కరోనా కట్టడి సమయంలో స్వల్ప విరామం మినహా తిరుమల ఆలయం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో అన్ని జాగ్రత్తలతో గత నెల 8వ తేదీ నుంచి స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడుగా తిరుమల శ్రీవారు ప్రసిద్ధి. అందుకే భక్తులు తమ కోర్కెలు తీర్చిన స్వామి వారికి తమకు తోచిన విధంగా కానుకలు సమర్పించుకుంటారు. ఇందులో నగదుతోపాటు బంగారం, వజ్రాలు, వెండి, స్థిర ఆస్తులు కూడా ఉంటాయి. సాధారణ రోజుల్లో స్వామి వారి రోజు హుండీ ఆదాయం 3 కోట్ల రూపాయలు వస్తుంది. ఇక లడ్డూ విక్రయాలు, స్వామి వారి సేవా టిక్కెట్లు, కొండపై ఉన్న దుకాణాల అద్దెలు, గెస్ట్‌ హౌస్‌ల అద్దెలు, దేశంలో వివిధ ప్రాంతాల్లో స్వామి వారికి భక్తులు ఇచ్చిన స్థిర ఆస్తులపై వచ్చే అద్దెలు కలిపి ఎంత ఉంటుందో టీటీడీకి తప్పా మరెవరికీ తెలియదు.

తమ ఇష్టదైవం ఆస్తి ఎంతో తెలుసుకోవాలని భక్తుల్లో కోరిక, ఆసక్తి నిత్యం ఉంటుంది. భక్తుల కోర్కెలు తీర్చడంలో ముందుండే స్వామి వారు తన ఆస్తిని తెలుసుకోవాలనుకునే భక్తుల కోరికను కూడా తీర్చబోతున్నారు. తిరుమల శ్రీవారి ఆస్తిపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు టీటీడీ నిర్ణయించిందని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ రోజు వెల్లడించారు. వివాదాలకు తావు లేకుండా స్వామి వారి ఆస్తులపై సమగ్ర పరిశీలన జరిగి శ్వేత ప్రతం విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

కరోనా సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నా కూడా స్వామి వారి హుండీ ఆదాయం రోజుకు సరాసరి 50 లక్షలుగా ఉంటోంది. గత నెల 8 నుంచి 10వ తేదీ వరకు టీటీడీ సిబ్బందికి స్వామి వారి దర్శనం కల్పించారు. 11 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ప్రారంభంలో రోజుకు ఆరు వేల మందికి స్వామి వారి దర్శనం కల్పిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 12 వేలకు చేరుకుంది. గత నెల 11 నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ అంటే.. నెల రోజుల వ్యవధిలో స్వామి వారి హుండీ ఆదాయం 16.73 కోట్ల రూపాయలు వచ్చిందని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి