iDreamPost

తిరుమల భక్తులకు శుభవార్త.. ఇక నడక మార్గంలో ఇనుప కంచె?

తిరుమల భక్తులకు శుభవార్త.. ఇక నడక మార్గంలో ఇనుప కంచె?

భారత దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో తిరుమల తిరుపతి ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ప్రతిరోజూ వేల సంఖ్యల్లో ఇక్కడికి భక్తులు దర్శించుకోవడానికి వస్తుంటారు. కొండపైకి ఎక్కువగా నడక మార్గాన్నే ఎంచుకుంటారు భక్తులు. గత కొంతకాలంగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. భక్తులపై దాడులు చేయడం, చంపేయడం లాంటివి చేయడంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీటీడీ భక్తుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటూ వస్తుంది. చిరుతలు సంచరిస్తున్న ప్రదేశాల్లో బోను ఏర్పాటుచేసి ఇప్పటి వరకు ఐదు చిరుతలను పట్టుకున్నారు. తాజాగా తిరులమ భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం కోసం వేల మంది భక్తులు వెళ్తుంటారు. చాలా మంది భక్తులు కొండపైకి నడిచి వెళ్తడానికి ఇష్టపడుతుంటారు. ఇటీవల అలిపిరి-తిరుమల నడక మార్గాల్లో చిరుత పులులు, ఎలుగు బంట్లు భక్తులపై దాడి చేస్తూ చంపేస్తున్నాయి. ఇటీవల నెల్లూరికి చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కౌశిక్‌ అనే బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరిచింది. దీంతో టీటీడీ భక్తుల భద్రతపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు. చిరుతలు సంచారం చేసే చోట సీసీ కేమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నడక మార్గాన వెళ్లే భక్తులకు కర్రలు ఇస్తున్నారు. తాజాగా టీటీడీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తిరుమల నడక మార్గంలో ఇనుక కంచెను ఏర్పాటు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న నడక మార్గాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉండటంతో ఇనుక కంచె ఏర్పాటు పై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని టీటీడీ తెలిపింది. ఇప్పటికే ఇనుక కంచె ఏర్పాటు కేంద్ర అటవీ శాఖకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపినట్లు స్పష్టం చేసింది. టీటీడీ అభ్యర్థన మేరకు త్వరలో ఎక్స్ ఫర్ట్స్ కమిటీ నడక మార్గంలో పర్యటించి నివేదిక అందజేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన తగిన డిజైన్లతో అంగీకారం తెలిపితే కంచె నిర్మాణానికి సిద్దమంటుంది టీటీడీ యంత్రాంగం. ఇదిలా ఉంటే.. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ఇరువైపులా కంచె నిర్మాణం చేపట్టాలని భక్తుల నుంచి డిమాండ్ ఎప్పటి నుంచో వస్తున్న విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి