iDreamPost

20 వేల లోపు అగ్రిగోల్‌ డిపాజిట్ల చెల్లింపునకు మార్గం సుగమం

20 వేల లోపు అగ్రిగోల్‌ డిపాజిట్ల చెల్లింపునకు మార్గం సుగమం

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు నగదు చెల్లించాలని గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. 20 వేల రూపాయల లోపు డిపాజిటర్లకు నగదు చెల్లించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. రాబోవు మార్చి నెలాఖరు లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్ట్‌ సంస్థ వివాదంలో చిక్కుకుంది. నిర్వాహకులు జైలుకెళ్లారు. లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అగ్రిగోల్ట్‌ సంస్థ డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉంది. వందలాది మంది ఏజెంట్లు, డిపాజిటర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలను చూసిన వైఎస్‌ జగన్‌.. తాము అధికారంలోకి వస్తే డిపాజిట్లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ తొలి బడ్జెట్‌లోనే దాదాపు 1100 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించేందుకు కేటాయించారు. ఈ మొత్తం 20 వేల లోపు డిపాజిటర్లకు చెల్లించాలని నిర్ణయించారు. మొదటి దశలో పది వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న వారికి చెల్లింపులు చేశారు. ఆ తర్వాత మళ్లీ కోర్టు వివాదాలు నెలకొనడంతో మిగతా సొమ్ము చెల్లించడంలో అవాంతరాలు తలెత్తాయి.

20 వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న వారికి నగదు చెల్లించేందుకు అనుమతించాలని కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కోరుతోంది. మానవతాదృక్ఫథంతో స్పందించాలని విన్నవించింది. పలుమార్లు విచారణ జరిపిన తెలంగాణ ఎట్టకేలకు ఈ రోజు అనుమతి మంజూరు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి