iDreamPost

పీవీ కుమార్తెదే గెలుపు

పీవీ కుమార్తెదే గెలుపు

ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఫలితం వచ్చింది. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ ప్రధాని పీవీ నరశింహారావు కుమార్తె సురభి వాణి గెలుపొందారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి అయిన రామచందర్‌ రావుపై విజయం సాధించారు. నాలుగు రోజులుగా నిర్విర్యామంగా సాగుతున్న కౌటింగ్‌ ఈ రోజుతో ముగిసింది.

ఈ స్థానంలో 93 మంది పోటీ చేశారు. 3,57,354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. సురభి వాణి, రామచందర్‌రావు మధ్య హోరాహోరీ పోరు సాగింది. తొలి రౌండ్‌ నుంచి సురభి వాణి ఆధిక్యంలో ఉన్నా.. ఆమెకు, బీజేపీ అభ్యర్థి రామచందర్‌ రావుకు మధ్య ఓట్లలో భారీ తేడా కనిపించలేదు. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కింపు అనివార్యమైంది.

రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. ఫలితం తేలే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్‌ చేస్తూ యంత్రాంగం ఓట్లు లెక్కింపు చేపట్టింది. ఆయా ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచారు. మూడో స్థానంలో కొనసాగుతున్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా ఎలిమినేట్‌ కావడంతో.. ఈ స్థానంలో ఫలితం తేలిపోయింది. సురభి వాణి విజయం ఖరారైంది.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న బీజేపీకి ఈ ఫలితం బ్రేక్‌ వేసింది. సిట్టింగ్‌ స్థానాన్ని బీజేపీ కోల్పోవడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న రామచందర్‌ రావు మాజీగా మిగిలిపోయారు.

కాగా, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల స్థానంలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కొనసాగుతున్నారు. అక్కడ కూడా టీఆర్‌ఎస్‌నే విజయం వరిస్తుందని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఈ రోజు అర్థరాత్రికి ఫలితం తేలే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి